గద్వాల, వెలుగు : ప్రతి కేసులో నిధులకు శిక్ష పడేలా చూడాలని అప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఎస్పీ రితిరాజ్ పేర్కొన్నారు. శనివారం ఎస్పీ ఆఫీసులో అదనపు పీపీలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేసులపై ఎస్పీ చర్చించారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో శిక్షలు పడకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో శిక్ష పడాలని, దానికోసం పీపీలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఇన్ టైంలో ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేయడం, కేసుల్లో సాక్ష్యం బలంగా ఉండేలా చూస్తే శిక్షలు పడే అవకాశం ఉంటుందని చెప్పారు. డీసీఆర్బీ ఇన్స్ పెక్టర్ శివకుమార్, ఎస్ఐలు రమాదేవి, రశీద్ పాల్గొన్నారు.
విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ లేదు..
ఎన్నికల్లో గెలిచిన వారు విజయోత్సవ ర్యాలీలు చేసేందుకు పర్మిషన్ లేదని ఎస్పీ రితిరాజ్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రస్తుతం జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు పెట్టవద్దని కోరారు.