- డిజిటల్ అరెస్టు అంటూ వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దు
రామచంద్రాపురం(అమీన్పూర్), వెలుగు: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి అధికారులమని బెదిరిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ రూపేశ్సూచించారు. శనివారం పటాన్చెరు సబ్డివిజన్పోలీసుల ఆధ్వర్యంలో అమీన్పూర్లో స్టూడెంట్స్‌కు సైబర్‌నేరాలు, ట్రాఫిక్‌రూల్స్, డ్రగ్స్అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు అమీన్ పూర్ పీఎస్పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
వీటి బారిని పడుతున్న వారు ఎక్కువగా విద్యావంతులే ఉంటున్నారన్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వంటి ఆన్లైన్ మోసాలపై అవగాహనతో ఉండాలన్నారు. ఏ పోలీసు అధికారి నేరుగా వాట్సాప్, వీడియో కాల్స్ చేయరని డిజిటల్అరెస్ట్ అంటూ చేసే కాల్స్ ను నమ్మొద్దన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే 48 గంటల్లోపు 1930 కు కాల్ చేసి కంప్లైంట్చేయాలని సూచించారు.
మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు
మత్తు పదార్థాల వల్ల జీవితాలు చిత్తుగా మారుతాయన్నారు. గంజాయి అక్రమ రవాణా, అమ్మకం, సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల నుంచి టర్మినేట్ చేయిస్తామని చెప్పారు. డ్రగ్ ఫ్రీ జిల్లా గా మార్చడంలో పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, బైక్నడిపేటప్పుడు హెల్మెట్, కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నరేశ్, రవీందర్ రెడ్డి, లాలూ నాయక్, స్టూడెంట్స్, యువత పాల్గొన్నారు.