ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు ఎన్ కౌంటర్‌పై ఆ జిల్లా ఎస్పీ శబరీష్ ఆదివారం (డిసెంబర్ 1) కీలక ప్రకటన చేశారు. ‘‘వాజేడులో ఇద్దరు అమాయకులను మావోయిస్టులు చంపారు. ఇలాంటి ఘటనలు అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పెంచాము.
ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం 6 గంటలకు పెట్రోలింగ్ టీమ్‌కు 10 నుండి 15 మంది మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసులను చూసి వాళ్లు కాల్పులు జరిపారు. లొంగిపోవాలని పలుసార్లు హెచ్చరించినా.. కాల్పులు ఆపలేదు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల తర్వాత సెర్చ్ చేయగా ఏడుగురు చనిపోయినట్లు గుర్తించాం’’ అని తెలిపారు.
ALSO READ | రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై CM రేవంత్ బిగ్ అప్డేట్
మావోయిస్టులు అడవులను వదిలి.. జనజీవన స్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. మరోవైపు ఎన్ కౌంటర్ నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కొందరు మావోయిస్టులు పారిపోయారన్న అనుమానంతో జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఏజెన్సీ ఏరియాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.