మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో పెండింగ్ కేసులపై ప్రత్యేక పోలీస్ ఆఫీసర్లు దృష్టి సారించాలని మహబూబాబాద్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హల్లో సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేసులో నిష్పక్షపాత దర్యాప్తును పూర్తి చేసి, నేరస్తులను న్యాయస్థానం ముందు హాజరుపరచాలని చెప్పారు.
అలాగే 9న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే లా చూడాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కు పోలీసులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఈసీ పరిధిలో విధులు నిర్వహించాలని సూచించారు. గత ఎన్నికల్లో జరిగిన లోపాలను అధిగమించి, పకడ్బందీగా ఎంపీ ఎన్నికలు నిర్వహించాలన్నారు.
స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్, ఇతర జిల్లాలతో సరిహద్దు చెక్ పోస్ట్ లతో పాటు ఎస్ హెచ్వోలు తమ ఏరియాలలో తనిఖీలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, ట్రైనీ ఐపీఎస్పండరి చేతన్,మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, తొర్రుర్ డీఎస్పీ వి.సురేశ్ పాల్గొన్నారు.