- 2023 జిల్లా క్రైమ్ వివరాల విడుదల
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ చెప్పారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ రేట్‌ను గురువారం టౌన్ పీఎస్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఎస్పీ వెల్లడించారు. గ్రామాల సందర్శన, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పెట్రోలింగ్ పెంచడం వల్ల గొడవలు, అల్లర్లు జరగకుండా చర్యలను చేపట్టినట్లు తెలిపారు.
మావోయిస్టు కదలికలపై నిరంతర నిఘా పెట్టామన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
278 ప్రమాదాల్లో 126 మంది మృతి
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 278 రోడ్డు ప్రమాదాలు జరిగి 126 మంది చనిపోగా, 277 మంది గాయపడ్డారు. గతేడాది 279 యాక్సిడెంట్లట్లలో 141 మంది చనిపోగా, 274 మంది గాయపడ్డారని ఎస్పీ చెప్పారు. గతేడాదితో పోలిస్తే హత్య కేసులు 62.96 శాతం, నేరపూరిత నరహత్యలు 45.45 శాతం, కిడ్నాప్ కేసులు 23.88 శాతం, రేప్ కేసులు 15.38 శాతం, మోసపూరిత నేరాలు 25.18 శాతం, పోక్సో కేసులు 9.37, గంజాయి కేసులు 9.09, సైబర్ నేరాలు 13.55 తగ్గినట్లు వెల్లడించారు.
అలాగే మహిళలపై అఘాయిత్యాలు 9.34 శాతం, ఆస్తి సంబంధిత నేరాలు 8.29 శాతం, గాయాల కేసులు 0.42 శాతం, ఎస్సీ, ఎస్టీ నేరాలు 24.44 పెరిగాయని ఎస్పీ చెప్పారు. ఈ ఏడాది జిల్లాలో 10 హత్య, 51 కిడ్నాప్ కేసులు, 44 రేప్ కేసులు, 117 మహిళలకు దాడులకు సంబంధించిన కేసులు నమోదైనట్లు తెలిపారు.