
లక్నో: తనను చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధికార ప్రతినిధి తారీఖ్ ఖాన్ తెలిపారు. గత రెండు నెల రోజుల నుంచి ఇలాంటి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. ‘‘గత రెండు నెలల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను పెద్దగా పట్టించుకోలేదు. శుక్రవారం రాత్రి మరోసారి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు. మా లిస్టులో తర్వాత నీ నంబరే ఉంది.
జాగ్రత్తగా ఉండండి. మేమెరో నీకు త్వరలో తెలుస్తుంది. రెండు మూడ్రోజులు ఆగండి.. మేమవరో మీకు చూపిస్తాం” అని ఫోన్‌లో బెదిరించినట్లు ఆయన చెప్పారు. ఈ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, పార్టీ చీఫ్ అఖిలేశ్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రస్తుతం ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా, ఈ కాల్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే వచ్చాయా లేక ఫ్రాడ్ కాల్స్ అనేది తెలుసుకునేందుకు విచారణ చేపట్టామని పోలీసులు వెల్లడించారు.