వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ సుధీర్ రామ్​నాథ్​ కేకన్

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ సుధీర్ రామ్​నాథ్​ కేకన్

మహబూబాబాద్/ నర్సింహులపేట, వెలుగు: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్​నాథ్​ కేకన్  పోలీస్​ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిధిలోని ఆకేరు వాగులో చిన్నగూడురు మండలం నుంచి నెల్లికుదురు, నరసింహులపేట మండలాల పరిధి వరకు విస్తృతంగా పర్యటించారు. కొమ్ములవంచ, రామన్నగూడెం పరిధిలోని ఇసుక ర్యాంపులను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణా పై పోలీసు శాఖ  దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్​, ఏఆర్​డీఎస్పీ శ్రీనివాస్, తొర్రూరు సీఐ గణేశ్, ఎస్సైలు సురేశ్, ఝాన్సీ, రమేశ్​బాబు తదితరులు పాల్గొన్నారు. 

చొక్కాల ఇసుక రీచ్ తనిఖీ 

వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల ఇసుక రీచ్ ను ములుగు ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఇసుక రీచ్ స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు. అనంతరం ఇసుక రీచ్ నిర్వహిస్తున్న సమ్మక్క సారక్క గిరిజన సొసైటీ సభ్యులతో మాట్లాడారు. నేటితో ఇసుక రీచ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, సీఎఫ్వో, సీఎఫ్ఈ అనుమతులు ముగిశాయని, ఇసుక తవ్వకాలు నిర్వహించకూడదని ఆదేశించారు.