- రోడ్డు ప్రమాదాల్లో 262 మంది మృతి
- మహిళలపై అఘాయిత్యాలు పైపైకి
- వార్షిక క్రైమ్ వివరాలను వెల్లడించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని, రోడ్డు ప్రమాదాలు పెరిగాయని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక క్రైమ్ రిపోర్టును విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది 12,436 పిటిషన్లు రాగా, అందులో 7,244 ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఈ ఏడాది 11,110 పిటిషన్లు రాగా, వాటిలో 7,178 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో 262 మంది మరణించగా, 544 మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది డయల్100కు 34,950 కాల్స్ వచ్చాయని, వాటిలో యావరేజ్ గా ఆరు నిమిషాల్లోనే రెస్పాండ్ అయినట్లు చెప్పారు.
భారీగా దోచుకున్న సైబర్ నేరగాళ్లు..
గతేడాది కంటే ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేట్ తగ్గినా బాధితులు నేరగాళ్ల చేతిలో మోసపోయి భారీగా నగదు పోగొట్టుకున్నారు. 2023లో 844 ఫిర్యాదులు రాగా, 231 కేసులు నమోదు చేశారు. వీటిలో రూ.5.12 కోట్ల నగదు పోగొట్టుకోగా, రూ.9.20 లక్షలు తిరిగి స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. మరో రూ.66.31 లక్షలు బ్యాంక్ లో హోల్డ్ లో పెట్టారు. 2024లో 1212 ఫిర్యాదులు రాగా, 205 కేసులు నమోదయ్యాయి. దాదాపు రూ.7.83 కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారు. వీటిలో రూ.39.04 లక్షలు రికవరీ చేయగా, రూ. 1.16 కోట్లు బ్యాంక్ లో హోల్డ్ లో పెట్టారు.
పెరిగిన రోడ్డు ప్రమాదాలు..
సూర్యాపేట జిల్లాలో 2024లో మొత్తం 609 ఆక్సిడెంట్లు నమోదయ్యాయి. ఇందులో 225 ఫ్యాటల్ కేసులు నమోదు కాగా, 306 నాన్ ఫ్యాటల్ కేసులు ఉన్నాయి. ప్రమాదాల్లో 262 మంది మరణించగా 544 మందికి గాయాలయ్యాయి. గతేడాది 573 రోడ్డు ప్రమాదాలు జరిగితే 257 మంది మృతి చెందగా, 512 మంది గాయపడ్డారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా రూరల్ ప్రాంతాల్లోనే జరిగాయి. చాలా మంది హెల్మెట్ ధరించకపోవడం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు.
మహిళలపై అఘాయిత్యాలు పైపైకి..
జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. 2023లో 64 రేప్ కేసులు నమోదు కాగా, 2024లో ఆ సంఖ్య 84 కు చేరింది. 2023లో 22 మర్డర్ కేసులు కాగా, 2024లో 20 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో వైట్ కలర్ కేసులు భారీగా పెరిగాయి. మిల్లర్లు సీఎమ్మార్ రైస్ ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. దొంగతనాలు 269 నుంచి 338 కి పెరిగాయి. వీటిలో రూ.4.92 కోట్లు చోరీ చేయగా, రూ.2.18 కోట్లు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 248 తులల బంగారం, 2.5 కేజీల వెండి, 112 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.