మావోయిస్టులకు భయపడొద్దు.. నిర్భయంగా ఓటేయండి : ఎస్పీ సురేశ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజలు నిర్భయంగా ఓటేయాలని, మావోయిస్టులకు ఎవరూ భయపడొద్దని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ ప్రజలకు ధైర్యం చెప్పారు. శనివారం లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల, మావోయిస్టు ప్రాబల్యమున్న ఎల్లా పటార్ పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భం స్థానికులతో మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున ఓటు వేయడానికి ఎవరూ భయపడొద్దని, పోలీసు బలగాలు తోడుగా ఉంటాయన్నారు.

మావోయిస్టుల ప్రలోభాలకు లోను కావద్దని, వారికి సహకరించొద్దని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ప్రజాస్వామ్య బద్ధంగా వినియోగించుకొని మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో తమ పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల్లో ఎన్నికల పట్ల విశ్వాసాన్ని పెంపొందించే దిశగా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తుల మాయ మాటలు నమ్మొద్దని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ ఎం.వెంకటరమణ, జైనూర్ సీఐ మల్లేశ్, ఎస్ఐ లు సందీప్, ప్రవీణ్ పాల్గొన్నారు.