ఎలక్షన్​ రూల్స్ పక్కాగా అమలు చేస్తున్నాం : సురేశ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో రూల్స్ పక్కగా అమలు చేస్తున్నామని ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం చెక్​ పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నగదు, మద్యం, ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. మోడల్ కోడ్ అమలులోకి వచ్చినందున ప్రజలు రూ.50వేల నగదు కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లే వారు పెద్ద మొత్తంలో బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారు ఆధారాలను చూపాలని సూచించారు.

లేకపోతే ఆ వస్తువులను సీజ్ చేస్తామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.6,41,474 విలువైన 1,122.24 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.1,67,88,386 క్యాష్, రూ. 3,19,982 విలువైన 182 మొబైల్ ఫోన్లు, రూ.7వేల విలువైన 100 టిఫిన్​ బాక్స్ లు సీజ్ చేసినట్లు చెప్పారు. రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్  గల వారిని 1,465 మందిని ఇప్పటికే బైండోవర్ చేశామని తెలిపారు.