రియల్ఎస్టేట్ మాఫియాపై కఠిన చర్యలు : ఉదయ్ కుమార్ రెడ్డి

రియల్ఎస్టేట్ మాఫియాపై కఠిన చర్యలు : ఉదయ్ కుమార్ రెడ్డి

మెదక్, వెలుగు: ప్రజలను మోసగించే రియల్​ఎస్టేట్​మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఇంటి స్థలం, వ్యవసాయ భూమి కొనుక్కోవాలనుకునే ప్రజలు స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్​సరిగా ఉన్నాయో లేదో చెక్​ చేసుకోవాలని, నిజంగా అక్కడ స్థలం ఉందా లేదా అన్నది తనిఖీ చేసుకోవాలన్నారు. ఇటీవల హైదరాబాద్​నుంచి పెద్ద శంకరంపేట మండల పరిధిలో భూములు కొనడానికి వచ్చిన వాళ్లను ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మధ్యవర్తులుగా ఉండి మోసంగించారని తెలిపారు. 

రోడ్డు సైడు మెయిన్ బిట్ అమ్మడానికి ఉందని ఫేస్ బుక్​లో ఫొటో, ఫోన్ నెంబర్ తో పోస్ట్ చేయగా, హైదరాబాద్​కూకట్​పల్లికి చెందిన జ్యోతి వాటిని చూసి భూమి కొనుగోలుకు సిద్దపడ్డారన్నారు. సదరు వ్యక్తులను సంప్రదించగా మెయిన్ రోడ్డు బిట్టు చూయించి, రూ.31.40 లక్షలు తీసుకొని రోడ్డు నుంచి దూరంగా ఉన్న వ్యవసాయానికి పనికి రాని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లోని భూమిని రిజిస్ట్రేషన్ చేసి మోసగించారని తెలిపారు.

 రిజిస్ట్రేషన్ అయిన తర్వాత భూమి దగ్గరికి వెళ్లి చూసే సరికి మోసపోయిన విషయం తెలిసిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెద్ద శంకరంపేట పీఎస్​లో ఏడుగురిపై కేసు నమోదు చేసిన విషయాన్ని  గుర్తు చేశారు. అందువల్ల భూమి కొనేవారు ఒకటికి రెండు సార్లు పక్కాగా చెక్ చేసుకుని అన్నీ పక్కగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వతే కొనుగోలు చేయాలని ఎస్పీ సూచించారు.