
- రూ. 20 లక్షలు నగదు, పేలుడు పదార్థాలు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్
భద్రాచలం, వెలుగు : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు కొరియర్లను అరెస్టు చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్ పేర్కొన్నారు. భద్రాచలంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. గౌరారం గ్రామ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది, పోలీసులు కలిసి తనిఖీలు చేస్తుండగా పైడిగూడెం వైపు నుంచి పెద్ద నల్లబల్లి సెంటర్ వైపు వస్తున్న కారును ఆపకుండా వెళ్లారు.
అనుమానంతో వెంబడించి పట్టుకొని విచారించగా అందులో ఉన్నవారు మావోయిస్ట్ పార్టీ కొరియర్లుగా గుర్తించామని చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి చెందిన కుంజ రఘువరన్, పులిపాటి రవితేజ, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన బైరెడ్డి సతీశ్, ఉబ్బనపల్లి దినేష్ కుమార్ ఉన్నారని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ. 20లక్షల నగదు, జిలెటెన్ స్టిక్స్, కార్డెక్స్‌వైర్, డిటోనేటర్, రెండు రౌండ్స్ బుల్లెట్స్‌తో పాటు కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఈ నలుగురు కొరియర్లు ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టు నేతలను కలిసి వచ్చారన్నారు. పోలీసులపై దాడులు చేసేందుకు అవసరమైన పేలుడు పదార్థాలు తీసుకొచ్చేందుకు కొరియర్లకు మావోయిస్టు నేతలు డబ్బులిచ్చారన్నారు. ఓఎస్డీ సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పంకజ్పరితోశ్, దుమ్ముగూడెం సీఐ రమేశ్, ఎస్సై కేశవ్, సీఆర్పీఎఫ్ అధికారులు ప్రీతా, ఆర్కే చౌరాసియా పాల్గొన్నారు.