స్పేస్ సెక్టార్​ .. ఇండియాకు పదేండ్లలో రూ.1,243 కోట్ల ఆమ్దానీ

స్పేస్ సెక్టార్​ .. ఇండియాకు పదేండ్లలో రూ.1,243 కోట్ల ఆమ్దానీ
  • పదేండ్లలో రూ.1,243 కోట్ల ఆమ్దానీ
  • 393 ఉపగ్రహాలు స్పేస్​లోకి చేర్చిన ఇస్రో.. లోక్​సభలో కేంద్రమంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: స్పేస్ సెక్టార్​లో ఇండియాకు పదేళ్లలో రూ.1,243 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2015 నుంచి 2024 వరకు విదేశీ శాటిలైట్ల ప్రయోగం ద్వారా ఈ రెవెన్యూ వచ్చిందని లోక్​సభలో ప్రకటించారు. ‘‘గడిచిన పదేండ్లలో మొత్తం 393 విదేశీ ఉప గ్రహాలను ఇండియా లాంచ్ చేసింది. 

ఇస్రోకు చెందిన పీఎస్​ఎల్​వీ, ఎల్​వీఎం3, ఎస్ఎస్ఎల్​వీ లాంచ్ వెహికల్స్ నుంచి శాటిలైట్లు ప్రయోగించింది. ఇస్రో.. మొత్తం 34 దేశాలకు శాటిలైట్ లాంచింగ్ సేవలు అందించింది. అభివృద్ధి చెందిన దేశాల శాటిలైట్లను కూడా మనం ప్రయోగించాం. అత్యధికంగా అమెరికాకు చెందిన 232 శాటిలైట్లను నింగిలోకి పంపినం. ఆ తర్వాత యూకేవి 83, సింగపూర్​వి 19, కెనడావి 8, కొరియావి 5, లక్జెం​బర్గ్​వి 4, ఇటలీవి 4, జర్మనీ, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్స్​కు చెందిన మూడేసి శాటిలైట్లు సహా పలు దేశాల ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది’’ అని జితేంద్ర సింగ్ లోక్​సభలో వెల్లడించారు. 

మరో 61 దేశాలు, పలు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన శాటిలైట్లను లాంచ్ చేసేందుకు ఇస్రో ఒప్పందం కుదుర్చుకున్నదని తెలిపారు. ‘‘లాంచింగ్ చేసిన వాటిలో శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ నేవిగేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్,  కెపాసిటీ బిల్డింగ్​కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. 

స్పేస్ సెక్టార్​లో ఇండియా అద్భుత విజయాలు సాధించిందని సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. 2023లో చంద్రయాన్ 3లో భాగంగా సాఫ్ట్ ల్యాండింగ్ అనంతరం చాలా దేశాలు శాటిలైట్ల ప్రయోగాలకు ఇండియాను సంప్రదిస్తున్నాయని వివరించారు. చంద్రుడి సౌత్​పోల్​లో ఇండియా అడుగుపెట్టిందన్నారు. చంద్రయాన్ 3 తర్వాత ఫస్ట్ సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 విజయవంతంగా లాంచ్ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది గగన్​యాన్ మిషన్​పై ఫోకస్ పెట్టిందన్నారు.