వాషింగ్టన్:భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో.. గంటకు 27 వేల కిలోమీటర్ల స్పీడ్ తో భూమి చుట్టూ తిరుగుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) అంతరిక్షంలో పల్టీలు కొట్టిందట. రష్యా పంపిన ఒక మాడ్యూల్‌ను అటాచ్ చేసే క్రమంలో ఐఎస్ఎస్ ఒకటిన్నర పల్టీలు కొట్టిందంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. జులై 29న ఈ సంఘటన జరగగా, ఐఎస్ఎస్ 45 డిగ్రీల కోణంలో కదిలిందని, దానిని సరిచేశామంటూ అమెరికా, రష్యన్ అంతరిక్ష సంస్థలు నాసా, రాస్ కాస్మోస్ ప్రకటించాయి. అయితే నాసా, రాస్ కాస్మోస్ ప్రకటించిన దానికంటే పరిస్థితి చాలా సీరియస్ గా ఉండిందని, స్పేస్ లో పూర్తిగా తలకిందులు అయిపోయిన ఐఎస్ఎస్ను తిరిగి సరిచేయడంతో ఐఎస్ఎస్లోని ఆస్ట్రోనాట్లు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఐఎస్ఎస్ పల్టీలు కొట్టిన విషయాన్ని స్వయంగా నాసా, రాస్ కాస్మోస్ సైంటిస్టులే వెల్లడించారని పేర్కొంది.
ఏం జరిగిందంటే..?
రష్యా పంపిన ‘నౌకా’ మాడ్యూల్ జులై 29న ఐఎస్ఎస్తో డాక్ అయింది. ఆ వెంటనే మాడ్యూల్ థ్రస్టర్లు వాటంతటవే మండటం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఐఎస్ఎస్ మెల్లగా పైకి లేస్తూ వెనక్కి పల్టీ కొట్టింది. ఐఎస్ఎస్ను కంట్రోల్ చేసేందుకు ఇతర మాడ్యూల్స్ లోని థ్రస్టర్లను స్టార్ట్ చేసినా, ఫలితం లేకపోయింది. సుమారు15 నిమిషాల పాటు నౌకా మాడ్యూల్ థ్రస్టర్లు మండి, మళ్లీ వాటంతట అవే ఆగిపోయిన తర్వాతే పరిస్థితి కంట్రోల్ అయినట్లు చెప్తున్నారు. అప్పటికే ఐఎస్ఎస్ పూర్తిగా ఒక పల్టీ కొట్టేసి, మరోసగం వరకు పల్టీ కొట్టే స్థితికి చేరింది. నౌకా మాడ్యూల్ థ్రస్టర్లు ఆగిపోవడంతో, తిరిగి 180 డిగ్రీలు సరిచేసి, ఐఎస్ఎస్ ను సరిచేశారు. కొద్ది సేపు సాఫ్ట్ వేర్ ఫెయిల్ కావడం వల్లే.. తాము పంపిన డైరెక్ట్ కమాండ్స్ తప్పుగా అమలు అయ్యాయని, దీంతో థ్రస్టర్లు ఆన్ అయ్యాయని రాస్ కాస్మోస్ సైంటిస్ట్ వ్లాదిమిర్ సోలోవ్యోవ్ వెల్లడించారు. అయితే సెకనుకు 0.5 డిగ్రీల మేరకు మాత్రమే ఐఎస్ఎస్ పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ఏడుగురు ఆస్ట్రోనాట్లకు పెద్దగా తేడా ఏమీ అనిపించలేదన్నారు. ఐఎస్ఎస్ 540 డిగ్రీల కోణంలో పల్టీ కొట్టినట్లు హూస్టన్ లోని నాసా మిషన్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ జెబులాన్ స్కోవిల్లే కూడా చెప్పారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.