మస్క్ గోల్‌ మార్స్..మార్స్‌‌‌‌ మీదకు సామాన్యుడు

మస్క్ గోల్‌ మార్స్..మార్స్‌‌‌‌ మీదకు సామాన్యుడు
  • ప్లాన్‌‌‌‌ చేస్తోంది ఎలాన్‌‌‌‌ మస్క్ స్థాపించిన స్పేస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ కంపెనీ. 
  • ఇదొక్కటే కాదు... మస్క్ ఏం చేసినా మామూలుగా ఉండదు. 
  • చిన్నప్పుడే ఎంట్రపెనూర్‌‌‌‌‌‌‌‌గా వ్యాపార జీవితాన్ని మొదలుపెట్టి.. 
  • ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో నిలిచాడు. నష్టాల్లో ఉన్న టెస్లాకు 
  • సీఈవో అయ్యి... దాన్ని వరల్డ్‌‌‌‌లోనే నెంబర్‌‌‌‌‌‌‌‌ వన్ ఎలక్ట్రిక్‌‌‌‌ కార్ల కంపెనీగా మార్చేశాడు. 
  • ట్విట్టర్​ను కొని అందులో సమూల మార్పులు చేయడం మొదలుపెట్టాడు. 

ఇదంతా చూస్తుంటే... మస్క్‌‌ పట్టిందల్లా బంగారమే! అనుకోవడం సహజం. అతను దేన్ని పట్టుకుంటే దాని వాల్యూ విపరీతంగా పెరుగుతుంటుంది. అలా ఆయన చేపట్టడం వల్లే పేపాల్‌‌, టెస్లా, స్పేస్‌‌ ఎక్స్‌‌, సోలార్‌‌‌‌సిటీ లాంటివి వరల్డ్ బెస్ట్‌‌ కంపెనీలుగా ఎదిగాయి. అంతేకాదు.. మస్క్‌‌ ఏ కంపెనీ షేర్లు కొన్నా వాటి వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎప్పుడు ఏది అమ్మేయాలి? అనేది మస్క్‌‌ మైండ్​కు బాగా తెలుసు. అందుకే వరల్డ్‌‌లో టాప్‌‌ బిజినెస్‌‌ మ్యాన్​ల లిస్టులో చేరాడు మస్క్‌‌. ఇంత ఆలోచిస్తున్నాడు. ఇన్ని పనులు చేస్తున్నాడు అంటే... బాగా డబ్బున్న ఫ్యామిలీ అయిఉండొచ్చు అనుకుంటున్నారా? వాస్తవానికి మస్క్​ వాళ్లది మధ్య తరగతి కుటుంబం. అయితేనేం ఇప్పుడు మస్క్ దగ్గర ఉన్నంత డబ్బు ప్రపంచంలో ఎవరి దగ్గరా లేదు. అతని తెలివితేటలు, బిజినెస్‌‌ స్ట్రాటజీల వల్ల కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యాడు మస్క్‌‌. అలాగని డాంబికానికి పోడు. బ్యాంక్‌‌లో ఎన్ని వేల కోట్లు ఉన్నా సింపుల్‌‌గా బతుకుతాడు. అదే మస్క్‌‌ స్టయిల్‌‌. 

సైన్స్‌‌ అంటే ఇంట్రెస్ట్‌‌

మస్క్‌‌కు చిన్నప్పటినుంచి సైన్స్‌‌, కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్‌‌. ఎప్పుడూ ఆ సబ్జెక్ట్​కు సంబంధించిన పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు. దాంతో బయటి విషయాల మీద అంతగా అవగాహన ఉండేది కాదు. చాలా అమాయకంగా ఉండేవాడు. అందుకే  ఫ్రెండ్స్ మస్క్​ని ఎప్పుడూ ఆటపట్టించేవాళ్లు. చాలా ఇబ్బంది పెట్టేవాళ్లు. కొన్నిసార్లు కొట్టేవాళ్లు కూడా. అలా ఒకసారి మస్క్‌‌ని మెట్ల మీద నుంచి తోసేసి, కొట్టడంతో ఆసుపత్రి పాలయ్యాడు. అప్పుడు అయిన గాయాల వల్ల  ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. అది ఇప్పటికీ మస్క్‌‌ని ఇబ్బందిపెడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మస్క్‌‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలా చాలా ఇబ్బందులు పడుతూ చదువుకున్నాడు. 

తండ్రి కంప్యూటర్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌ కావడం వల్ల ఇంట్లో కంప్యూటర్ ఉండేది. దాంతో తన తండ్రి పుస్తకాలు చదివి... కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌‌ నేర్చుకున్నాడు. పగలు స్కూల్‌‌కి వెళ్తూ.. రాత్రిళ్లు  కోడింగ్ చేయడం నేర్చుకున్నాడు. పదిహేడేండ్లు వచ్చేనాటికి యూనివర్సిటీ లెవల్‌‌ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్‌‌ నేర్చుకున్నాడు. ఒకసారి కంప్యూటర్ స్కిల్స్ మీద ఆప్టిట్యూడ్‌‌ ఎగ్జామ్‌‌ రాశాడు. మస్క్‌‌ రాసిన ఆన్సర్‌‌‌‌ పేపర్లు చూసిన ఎగ్జామినర్లు అతనికి మళ్లీ ఎగ్జామ్‌‌ పెట్టారు. అందుకు కారణం.. వాళ్లు అప్పటివరకు అంత ఎక్కువ స్కోర్‌‌ చూడకపోవడమే. హైస్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత మస్క్ తన తల్లి మాయేతో కలిసి కెనడాకు వెళ్లాడు. అక్కడ అతని సోదరి టోస్కా, తమ్ముడు కింబాల్‌‌తో కలసి చదువుకున్నాడు. ఒంటారియోలోని కింగ్‌‌స్టన్‌‌లోని క్వీన్స్ యూనివర్సిటీలో రెండేండ్లు చదువుకున్నాడు. తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌‌లో పట్టా పొందాడు. వార్టోన్‌‌ స్కూల్‌‌ ఆఫ్‌‌ బిజినెస్‌‌లో ఎకనమిక్స్‌‌లో పట్టా పొందాడు. 

మొదటి బిజినెస్‌‌

పన్నెండేండ్ల వయసు నుంచి తెలివిగా బతకడం నేర్చుకున్న మస్క్‌‌.. ఆ తరువాత ఎంటర్‌‌‌‌ప్రెనూర్‌‌‌‌గా అనేక ప్రయోగాలు చేశాడు. పెన్సిల్వేనియాలో చదువుతున్నప్పుడు మస్క్‌‌ క్లాస్‌‌మేట్స్‌‌తో కలిసి ఒక పెద్ద ఇంటిని అద్దెకు తీసుకుని ఉండేవాడు. ఆ ఇంటి నుంచి కొంత ఆదాయం సంపాదించాలనే ఆలోచనతో దాన్ని నైట్‌‌ క్లబ్‌‌గా మార్చేశాడు. పగటి పూట కాలేజీకి వెళ్లి చదువుకునేవాడు. రాత్రి క్లబ్‌‌ నడిపేవాడు. మస్క్‌‌ మొదటి బిజినెస్‌‌ ఇది.. ఈ క్లబ్‌‌ ద్వారా ఇంటి అద్దెతో పాటు చదువుకయ్యే ఖర్చులు సంపాదించుకునేవాడు. ఒక పక్క చదువుకుంటున్నా కూడా మస్క్‌‌ ఫోకస్ ఎక్కువగా బిజినెస్‌‌ మీదే ఉండేది. 24 ఏండ్ల వయసులో అప్లైడ్‌‌ సైన్సెస్‌‌లో పీహెచ్‌‌డీ చేసేందుకు స్టాన్‌‌ఫోర్డ్‌‌ యూనివర్సిటీలో చేరాడు. కానీ, ఆయన మనసు మొత్తం వ్యాపారం పైనే ఉండేది. దాంతో పీహెచ్‌‌డీలో చేరిన రెండు రోజులకే అక్కడి నుంచి వచ్చేశాడు. 

జిప్‌‌2 

యూనివర్సిటీ నుంచి వచ్చేశాక బిజినెస్‌‌ మొదలుపెట్టాలి అనుకున్నాడు మస్క్‌‌. దాంతో 1995లో తన తమ్ముడితో కలిసి ‘జిప్‌‌2’ అనే కంపెనీ పెట్టాడు. ఇదొక వెబ్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ కంపెనీ. న్యూస్‌‌పేపర్లు ఆన్‌‌లైన్‌‌ సిటీ గైడ్స్​ను డెవలప్ చేసుకోవడానికి సాయపడుతుంది. ఇప్పుడంటే గూగుల్‌‌ జిపిఎస్‌‌ ఉంది. కానీ.. ఒకప్పుడు అడ్రస్ వెతకడం చాలా కష్టమయ్యేది. అలాంటి టైంలో జిప్‌‌2లో మ్యాపింగ్‌‌ సిస్టమ్‌‌ని తీసుకొచ్చాడు మస్క్‌‌. దీనికోసం 28,000 డాలర్లు పెట్టుబడి పెట్టాడు. ఇంకొంత డబ్బు ఏంజెల్‌‌ ఇన్వెస్టర్ల నుంచి సమకూర్చుకున్నాడు. ఈ కంపెనీకి మస్క్‌‌ చైర్మన్‌‌గా ఉన్నాడు. తర్వాత కంపెనీని కాంపాక్‌‌ అనే సంస్థ 307 మిలియన్‌‌ డాలర్ల నగదు, 37 మిలియన్‌‌ డాలర్ల షేర్లను ఇచ్చి కొనుక్కుంది. దాంతో మస్క్‌‌ వాటా కింద 22 మిలియన్‌‌ డాలర్లు వచ్చాయి. ఇది మస్క్‌‌ జీవితంలో భారీ సక్సెస్‌‌. 

ఎక్స్‌‌.కామ్‌‌ 

మస్క్‌‌కి వచ్చిన లాభం నుంచి సగం కంటే తక్కువ పెట్టుబడి.. అంటే10మిలియన్‌‌ డాలర్లతో మరో స్టార్టప్‌‌ మొదలుపెట్టాడు. అదే ఆన్‌‌లైన్ బ్యాంకింగ్ కంపెనీ అయిన X.com. సంవత్సరంలోనే కంపెనీ లాభాల బాట పట్టింది. ఆ తర్వాత కంపెనీని కాన్ఫినిటీ అనే  మరో కంపెనీతో మెర్జ్‌‌ చేశారు. అప్పుడే దాని పేరుని ‘పేపాల్‌‌’గా మార్చారు. తర్వాత మస్క్‌‌ పేపాల్‌‌కు సీఈవో అయ్యాడు. కానీ.. ఆ కంపెనీ ఎక్కువ కాలం లేదు. కంపెనీ కో– ఫౌండర్స్‌‌ దాని సర్వర్లను యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి మైక్రోసాఫ్ట్ విండోస్‌‌కు మార్చాలని మస్క్‌‌ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దానికి మస్క్ ఒప్పుకోలేదు. మస్క్‌‌ సెలవుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లగానే పేపాల్ బోర్డు అతన్ని సీఈవో పదవి నుంచి తొలగించింది. థీల్‌‌ను కొత్త సీఈవోగా ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పేపాల్‌‌ను ‘ఈ-బే’ అనే కంపెనీ కొన్నది. దాంతో మస్క్‌‌కు165 మిలియన్‌‌ డాలర్లు వచ్చాయి. 

అవమానంతో మొదలైన ఆలోచన

పేపాల్‌‌ అమ్మడానికి ముందు నుంచే ఎలాన్‌‌ మస్క్‌‌ మరో ప్రాజెక్టు రెడీ చేసుకున్నాడు. అదే ‘మార్స్‌‌ ఒయాసిస్‌‌’. కొన్ని సంవత్సరాల్లో అంగారకుడి మీద కాలు మోపి.. దానిపై మనిషి ఉండడానికి సరిపోయే వాతావరణాన్ని క్రియేట్‌‌ చేయాలనేదే ఎలాన్‌‌ మస్క్ లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ‘స్పేస్‌‌ ఎక్స్‌‌’ అనే కంపెనీని మొదలుపెట్టాడు. అంతేకాదు.. మార్స్‌‌ మీద మానవ జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్‌‌ హౌస్‌‌ ఏర్పాటుచేయాలి అనుకున్నాడు. కానీ... మార్స్‌‌ మీదకు వెళ్లాలంటే పెద్ద పెద్ద రాకెట్లు అవసరం. కానీ.. మస్క్ దగ్గర ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ పెట్టడానికి తగినంత డబ్బు లేదు. పేపాల్ అమ్మిన తర్వాత కూడా అతని దగ్గర ఉన్నది 200 మిలియన్లే. అంతరిక్షంలోకి రాకెట్లను పంపే విషయానికి వస్తే అది చాలా చిన్న బడ్జెట్. అదే టైంలో రష్యా నుంచి రాకెట్లను కొనాలి అనుకున్నాడు. అందుకోసం మాస్కో వెళ్లాడు. కానీ, అక్కడ మస్క్‌‌కు పెద్ద అవమానం ఎదురైంది. అక్కడివాళ్లు చెప్పిన రేటుకు కొనేందుకు మస్క్‌‌ రెడీగా లేకపోవడంతో ‘కొనటానికి డబ్బులు లేవా?’ అని వెటకారం చేశారు. అప్పుడే మస్క్  సొంతంగా రాకెట్లు తయారుచేసుకోవాలని డిసైడ్​ అయ్యాడు. అమెరికా వచ్చి చౌకగా రాకెట్లను తయారుచేసేందుకు మార్గాలను వెతకడం మొదలుపెట్టాడు. 

సొంత రాకెట్లు 

ముడి పదార్థాలకు అయ్యే ఖర్చును లెక్క వేసుకుంటే రాకెట్‌‌ కొనే ఖర్చులో చాలా తక్కువ డబ్బుతోనే రాకెట్‌‌ తయారు చేయొచ్చనే విషయం మస్క్‌‌కు అర్థమైంది. అందుకే వంద మిలియన్‌‌ డాలర్ల పెట్టుబడితో 2002 మే నెలలో ‘స్పేస్‌‌ ఎక్స్‌‌’ కంపెనీ పెట్టాడు. కాలిఫోర్నియాలోని ఎల్ సెగుండోలో 75,000 చదరపు అడుగుల స్థలంలో కంపెనీ ప్రారంభమైంది.

ఫాల్కన్ 1 

మస్క్‌‌ కంపెనీ పెట్టిన వెంటనే సక్సెస్‌‌ రాలేదు. దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మొదట చేసిన రెండు రాకెట్‌‌ ప్రయోగాలు ఫెయిల్‌‌ అయ్యాయి. ముందుగా ఫాల్కన్‌‌ 1 రాకెట్‌‌ని ప్రయోగించారు. దీనికి స్టార్ వార్స్‌‌లోని ‘మిలీనియం ఫాల్కన్’ పేరు పెట్టారు. ఇది స్పేస్‌‌ ఎక్స్ నిర్మించిన మొదటి రాకెట్‌‌. 2006లో ప్రయోగించారు. కానీ.. ఫెయిల్‌‌ అయ్యింది. గాల్లోకి ఎగిరిన 33 సెకన్లలోనే పేలిపోయింది. అయినప్పటికీ నాసా వీళ్లకు ప్రాజెక్ట్‌‌లు ఇస్తూ ఎప్పటికప్పడు ఆదుకుంది. అయితే.. నాసా ఇచ్చిన పెద్ద ప్రాజెక్ట్‌‌లకు ముందు కంపెనీ ఫాల్కన్1ని విజయవంతంగా ప్రయోగించాలి. అందుకే 2007లో మళ్లీ ప్రయోగించడానికి ప్రయత్నించారు. అప్పుడు రాకెట్‌‌ పై వరకు వెళ్లి.. కక్ష్యను చేరుకోవడంలో విఫలమైంది. కానీ.. దాదాపు నాలుగున్నర  నిమిషాల పాటు పైకి ఎగిరింది. అందుకే దీన్ని కంపెనీ సక్సెస్‌‌గానే పరిగణించింది. కానీ.. కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. అందరూ స్పేస్‌‌ ఎక్స్‌‌ దివాలా తీయడం ఖాయం అనుకున్నారు. అప్పుడు వాళ్ల దగ్గర ఇంకా ఒక ప్రయోగానికే డబ్బు ఉంది. ఆ ప్రయోగం ఫెయిల్‌‌ అయితే కంపెనీ మూసేయాల్సిందే. కానీ.. 2008 సెప్టెంబర్‌‌‌‌లో చేసిన నాలుగో ప్రయోగం గ్రాండ్‌‌ సక్సెస్‌‌ అయ్యింది. 

రీ యూజబుల్‌‌ రాకెట్

నాసా సాయంతో ఫాల్కన్–9 ప్రయోగించడంపై పూర్తిగా ఫోకస్‌‌ పెట్టింది స్పేస్‌‌ ఎక్స్‌‌. ఫాల్కన్ 9 అనేది రీ యూజబుల్‌‌ టు స్టేజ్ రాకెట్. అంతేకాదు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్బిటల్ క్లాస్ రీ యూజబుల్‌‌ రాకెట్. ఇది స్పేస్ యాక్సెస్ ఖర్చును చాలా వరకు తగ్గిస్తుంది. ఫాల్కన్ 1 కంటే చాలా పెద్ద రాకెట్. చాలా ఎక్కువ బరువుని మోయగలదు. అందుకే ఫాల్కన్ 1 లాగా కూలిపోకుండా ఉండేందుకు చాలా సార్లు దీన్ని చెక్‌‌ చేశారు. చివరగా మే 2010లో కంపెనీ తన మొదటి ప్రయత్నంలోనే ఫాల్కన్ 9ని విజయవంతంగా ప్రయోగించింది. సమస్య ఏమిటంటే.. కొన్ని తెలియని కారణాల వల్ల కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ (ఇది ఫాల్కన్ 9 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది) స్పిన్‌‌లోకి వెళ్లింది. అయినా.. దాన్ని తర్వాత సరిచేశారు. 

చాలా తక్కువ ఖర్చు 

ఫాల్కన్‌‌ 9 సక్సెస్‌‌ తర్వాత కంపెనీ పేరు మార్మోగింది. స్పేస్‌‌ఎక్స్ ఈ ప్రాజెక్ట్‌‌ను చాలా ఎఫెక్టివ్‌‌గా పూర్తిచేసింది. ఎందుకంటే.. ఇదే ప్రయోగం నాసా చేస్తే.. ఎంత ఖర్చవుతుందో దానికి 5ఐదు రెట్లు తక్కువ ఖర్చుతో స్పేస్‌‌ ఎక్స్‌‌ ప్రయోగం చేసి ఔరా! అనిపించింది. అంతేకాదు.. అదే సంవత్సరం డిసెంబరులో డ్రాగన్ క్యాప్సూల్‌‌ను తిరిగి తీసుకొచ్చింది. దీని తర్వాత 2013లో ప్రయోగించడానికి ఫాల్కన్ హెవీని రెడీ చేసింది. దీని ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కార్గోను తీసుకెళ్లడానికి నాసా అనుమతి ఇచ్చింది. దాంతో స్పేస్‌‌ ఎక్స్‌‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ చేయడంలో సక్సెస్‌‌ అయ్యింది. దానికి డాకింగ్‌‌ చేసిన మొట్టమొదటి ప్రైవేట్‌‌ స్పేస్‌‌ క్రాఫ్ట్‌‌ స్పేస్‌‌ ఎక్స్‌‌ తయారు చేసిందే. 

డ్రాగన్-2 

స్పేస్‌‌ ఎక్స్‌‌ తర్వాత డ్రాగన్–2 ప్రాజెక్ట్‌‌ని రెడీ చేసింది. ఈ క్యాప్సూల్‌‌లో  ఏడుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లగలిగేలా రెడీ చేసింది. రెడ్ డ్రాగన్ అనేది స్పేస్‌‌ ఎక్స్‌‌ చేపట్టిన మరో ప్రాజెక్ట్‌‌. అంగారక గ్రహంపై ల్యాండింగ్ కెపాసిటీని టెస్ట్‌‌ చేయడానికి దీన్ని రెడీ చేశారు. అంతేకాదు 2012 నుంచి 2015 మధ్య కాలంలో రాకెట్‌‌ ఇంజన్లను బాగా డెవలప్ చేశారు. సొంతంగా ఫ్యుయెల్‌‌ని కూడా తయారుచేసుకున్నారు. 
గ్రాస్‌‌ హోపర్‌‌‌‌ (గొల్లభామ) టెక్నాలజీని డెవలప్‌‌ చేశారు. దీంతో రాకెట్లు అంతరిక్షంలోకి వెళ్లి, లక్ష్యాలను పూర్తి చేసుకుని మళ్లీ భూమ్మీదకు వచ్చి ల్యాండ్‌‌ అవుతాయి. వీటికోసం ప్రత్యేకంగా సముద్రపు బార్జ్‌‌ను సృష్టించారు. అంటే సముద్రంలో చిన్న ప్లేట్‌‌లాంటిది పెడతారు. దానిపై రాకెట్‌‌ని ల్యాండ్‌‌ చేస్తారు. అది కూడా సక్సెస్‌‌ అయ్యింది. మొదటి ఫాల్కన్ 9 బూస్టర్ ల్యాండింగ్ డిసెంబర్ 21, 2015న జరిగింది. లాంచ్ ప్యాడ్ సమీపంలోని రోబోటిక్ డ్రోన్ షిప్‌‌లో ఇవి దిగుతాయి. అనేక ఫాల్కన్ 9 బూస్టర్లను లాంచ్ ఖర్చులను తగ్గించడానికి చాలాసార్లు ప్రయోగించారు. ఇప్పటివరకు స్పేస్‌‌ ఎక్స్ 261 సార్లు రాకెట్లను లాంచ్ చేసింది. అందులో 223 ల్యాండ్‌‌ చేయగలిగింది. వాటిలో 195 రీఫ్లయ్​లు చేసింది. 

వ్యోమగాములను 

వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి డ్రాగన్ వ్యోమనౌకను 2019లో టెస్ట్ చేశారు. ఒక లోపం వల్ల ఇది ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ చుట్టూ మైళ్ల దూరం వరకు పొగ కమ్ముకునేలా చేసింది. దాంతో కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. కానీ కంపెనీ 2020 కోలుకుంది. స్పేస్‌‌ఎక్స్ తన మొట్టమొదటి సిబ్బందితో కూడిన టెస్ట్ ఫ్లయిట్ డెమో–2ను మే 30, 2020న ప్రారంభించింది. వ్యోమగాములు బాబ్ బెన్‌‌కెన్, డౌగ్ హర్లీలను సురక్షితంగా ఐఎస్‌‌ఎస్‌‌కి వెళ్లారు. కంపెనీ కొత్తగా నిర్మించిన ఎండీవర్ స్పేస్‌‌ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్షనౌకలో ఇద్దరు వ్యక్తులు ఆగస్టు 2, 2020న భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు.

స్టార్‌‌‌‌షిప్‌‌ 

ఎలాన్‌‌ మస్క్ డ్రీమ్‌‌ ప్రాజెక్ట్‌‌ ఇది. అంగారక గ్రహంపై ల్యాండింగ్ అనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. అయితే.. అంగారక గ్రహం చాలా దూరంగా ఉంది. అందువల్ల అక్కడికి వెళ్లేముందు రెండోసారి ఫ్యుయెల్‌‌ని నింపుకోవాల్సి వస్తుంది. అదే ఈ ప్రాజెక్ట్‌‌కు పెద్ద సమస్య. అయితే.. రెండు రాకెట్లను ప్రయోగించడమే దీనికి పరిష్కారం. వాటిలో ఒకటి మరొకదానికి ఇంధనాన్ని తీసుకెళ్తుంది. ఈ ఏడు ఏప్రిల్ 20న స్టార్‌‌షిప్ టెస్ట్ లాంచ్ చేశారు. కానీ.. అది నింగిలోకి ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయింది. బూస్టర్ వేరవటానికి ప్రయత్నించినప్పుడు రాకెట్ వ్యవస్థలు విఫలమయ్యాయి. దీంతో స్టార్‌‌షిప్ పేలిపోయింది. లాంచ్ చేసిన 75 సెకన్ల తర్వాత స్టార్‌‌షిప్ కెమెరా నుంచి ఫొటోలు రిలీజ్​ అయ్యాయి. ఆ ఫొటోల్లో 33 ఇంజిన్‌‌లలో 27 ఇంజిన్లలో మాత్రమే లైట్లు వెలగడం కనిపించింది. భవిష్యత్తులో గ్రహాంతర ప్రయాణానికి స్టార్‌‌షిప్ బాటలు వేస్తుందని స్పేస్ ఎక్స్ చెప్తోంది. 

వేల ఉపగ్రహాలు

2019లో మస్క్ మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి భూమి చుట్టూ కక్ష్యలోకి 12,000 చిన్న ఉపగ్రహాలను పంపేందుకు ప్లాన్‌‌ చేశాడు. కానీ... ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఇప్పటివరకు స్టార్‌‌లింక్ ఉపగ్రహాల్లో కొన్ని మాత్రమే ప్రయోగించారు. ఇప్పటికే ఖగోళ శాస్త్రవేత్తలు రాత్రిపూట టెలిస్కోప్‌‌తో చూస్తే.. వికారమైన దారులు కనిపించాయి. ఉపగ్రహాల సంఖ్య పెరగడం వల్ల ముఖ్యమైన డాటా సేకరించే సంస్థలకు సమస్యలు తలెత్తుతాయని చాలా మంది రీసెర్చర్లు భయపడుతున్నారు. నాసా కూడా 2022లో స్టార్‌‌లింక్‌‌పై అభ్యంతరం చెప్పింది. స్టార్‌‌లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచితే భూమిపై రీసెర్చ్‌‌ చేయడం ఇబ్బందిగా మారుతుందని చెప్పింది.