రాకెట్‌ను పంపిన్రు.. పేల్చేసిన్రు

అది అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. ఆదివారం స్పేస్ ఎక్స్ కంపెనీ తన ఫాల్కన్ 9 రాకెట్ ను ప్రయోగించింది. గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆ రాకెట్ ఇంజన్లు ఆగిపోయాయి. అప్పటికే 43 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన రాకెట్ ఇంకా.. పైకి ఎగరడానికి బదులు మెల్ల మెల్లగా కిందకు పడిపోతూ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే, అంతకు కొన్ని సెకన్ల ముందే.. ఆ రాకెట్ నుంచి ఆస్ట్రోనాట్లు ఉండే క్రూ క్యాప్సూల్ ఎజెక్ట్ అయి దూరంగా వెళ్లింది. తర్వాత పారాచూట్ల సాయంతో వేగం తగ్గించుకుని, నెమ్మదిగా అట్లాంటిక్ సముద్రంలో దిగిపోయింది! అయ్యో.. రాకెట్ పేలిపోయిందా? ఆస్ట్రోనాట్లకు ఏమీ కాలేదు కదా? అనుకుంటున్నారా. నిజానికి ఆ క్రూ క్యాప్సూల్‌లో ఆస్ట్రోనాట్లే లేరు. ఆ రాకెట్ దానంతటదే పేలిపోలేదు. సైంటిస్టులే దాని ఇంజన్లు ఆగిపోయి, బూస్టర్లు పేలిపోయేలా చేశారు. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితే వస్తే ఆస్ట్రోనాట్లు సేఫ్​గా తిరిగి రావడం ఎలా? అన్నదాని గురించే ఈ డమ్మీ ప్రయోగం జరిగింది.

ప్రయోగంలో ఎమర్జెన్సీ క్రూ రెస్క్యూ సిస్టం రాకెట్ నుంచి సురక్షితంగా వేరుపడి, సముద్రంలో సేఫ్​గా దిగింది. దీంతో టెస్ట్ సక్సెస్ అయింది. నాసా 2011లో స్పేస్ షటిల్స్ ను పక్కన పెట్టింది. అప్పటి నుంచి ఆస్ట్రోనాట్లను ఐఎస్ఎస్ కు పంపడానికి రష్యా సోయజ్ రాకెట్ల సాయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన స్పేస్​ఎక్స్, బోయింగ్ కంపెనీలతో నాసా 2014లో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. అమెరికా నుంచే ఆస్ట్రోనాట్లను అంతరిక్షానికి పంపేందుకు స్పేస్ క్రాఫ్ట్ తయారీ బాధ్యతలను వీటికి అప్పగించింది. ఇందులో భాగంగానే ఆదివారం స్పేస్ ఎక్స్ తయారు చేసిన డ్రాగన్​ క్రూ క్యాప్సూల్​ సక్సెస్​ అయింది.  తద్వారా ఎమర్జెన్సీ టైంలో ఆస్ట్రోనాట్లను సేఫ్​గా దించేందుకు ఆస్కారం కలిగింది. ఆస్ట్రోనాట్లను వచ్చే మార్చిలో తమ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పంపేందుకు అంతా రెడీ అయిందని కంపెనీలు ప్రకటించాయి. ఇటీవల బోయింగ్​ స్టార్​లైనర్​ ఫెయిలైన సంగతి తెలిసిందే.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి