
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో గత తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ మరికొద్ది రోజుల్లోనే భూమిమీదకు తిరిగి రానున్నారు. ఈ నెల 19 లోపు వారు వచ్చే అవకాశం ఉంది. వారిని తిరిగి తీసుకువచ్చేందుకు బయల్దేరిన అంతరిక్ష నౌక డ్రాగన్ విజయవంతంగా ఐఎస్ఎస్ తో అనుసంధానం అయింది. నలుగురు వ్యోమగాములు ఉన్న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను నాసా, ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కలిసి నింగిలోకి తరలించాయి. క్రూ 10 పేరుతో ఈ మిషన్ చేపట్టాయి.
ఐఎస్ఎస్ తో అనుసంధానం అయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ నుంచి వ్యోమగాములు బయటకు వచ్చి సునీత, బుచ్ విల్ మోర్ ను కలిశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ తన మిత్రులను మళ్లీ కలవడం ఆనందంగా ఉందన్నారు. ‘‘ఇదొక వండర్ ఫుల్ డే” అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. సునీత, బుచ్ ను వ్యోమగాములు కలిసిన ఫొటోలను నాసా విడుదల చేసింది. వాస్తవానికి గత సంవత్సరంలోనే సునీత, బుచ్ తిరిగి భూమిమీదకు రావాల్సి ఉంది. అయితే, వారిని ఐఎస్ఎస్ కు అనుసంధానం చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ ఇద్దరూ ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు.
దీంతో స్టార్ లైనర్ ను మాత్రమే తిరిగి భూమిమీదకు ల్యాండ్ చేశారు. 9 నెలల పైనే ఆ ఇద్దరు ఆస్ట్రొనాట్లు అంతరిక్షంలోనే ఉన్నారు. అయితే, ఐఎస్ఎస్ లో అత్యధిక కాలం గడిపిన రికార్డు నాసా ఆస్ట్రొనాట్ ఫ్రాంట్ రూబియో పేరిట ఉంది. ఆయన 2023లో 371 రోజులు ఐఎస్ఎస్ లో ఉన్నారు. అంతకుముందు రష్యాకు చెందిన కాస్మొనాట్ వలేరి పోల్యాకోవ్ మిర్ స్పేస్ స్టేషన్ లో 437 రోజులు ఉన్నారు. ఇదే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డు.
సునీత, విల్ మోర్ కు అదనపు సాలరీ?
తొమ్మిది నెలలకుపైనే స్పేస్ లోనే ఉన్న సునీత, విల్ మోర్‌కు నాసా అదనపు ఆదాయం చెల్లిస్తుందన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ తొమ్మిది నెలల కాలానికి ఎలాంటి ఓవర్ టైమ్ సాలరీ వారికి చెల్లించరని రిటైర్ అయిన నాసా వ్యోమగామి కేడీ కోల్ మ్యాన్ తెలిపారు. “ఆ ఇద్దరు ఫెడరల్ ఉద్యోగులు.
ఐఎస్ఎస్ లో వారు గడిపిన టైమ్‌ను భూమిపై ఇతర ఫెడరల్ ఉద్యోగులు గడిపినట్లుగానే చూస్తారు. అయితే, వారికి అదనంగా చెల్లించే పరిహారం చాలా చిన్నమొత్తమే. స్పేస్ లో అదనంగా ఉన్నందుకు రోజుకు 4 డాలర్లు చొప్పున వారికి అందిస్తారు. ఈ లెక్కన వారికి 1148 డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.లక్ష) ఇస్తారు” అని కోల్ మన్ వెల్లడించారు.