ఒకే రాకెట్​లో 2 మూన్ ల్యాండర్​లు

  • యూఎస్, జపనీస్ కంపెనీల తరఫున ప్రయోగించిన స్పేస్ఎక్స్ 
  • విడివిడిగా 2, 3 నెలల గ్యాప్​తో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్​లు 

కేప్ కానవెరాల్: చంద్రుడిపైకి మరో రెండు ప్రైవేట్ కంపెనీలు ల్యాండర్లను ప్రయోగించాయి. యూఎస్ లోని కేప్ కానవెరాల్ నుంచి అమెరికాకు చెందిన ‘ఫైర్ ఫ్లై ఏరోస్పేస్’, జపాన్​కు చెందిన ‘ఐస్పేస్’ కంపెనీలకు చెందిన చెరో ల్యాండర్​ను మోసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ బుధవారం తెల్లవారుజామున నింగికి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగంలో ఖర్చును ఆదా చేసేందుకు గాను ఈ రెండు కంపెనీలు కలిసి స్పేస్ఎక్స్ సంస్థ ద్వారా ఈ ప్రయోగం చేపట్టాయి. ఈ రెండు ల్యాండర్​లతో కూడిన వ్యోమనౌకలు వేర్వేరు రూట్లలో చంద్రుడి కక్ష్యలోకి చేరుకోనున్నాయి. ఫైర్ ఫ్లై కంపెనీ ల్యాండర్ 2 నెలల్లో, ఐస్పేస్ ల్యాండర్ నాలుగైదు నెలల తర్వాత చంద్రుడిపై దిగనున్నాయి. 

చంద్రుడిపై ఉత్తరాన వేర్వేరు చోట్లకు..

టెక్సస్​కు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ కంపెనీ చంద్రుడిపై మొత్తం10 ఎక్స్ పరిమెంట్లు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా చంద్రుడి మట్టిని స్టడీ చేయడం, ఉపరితలాన్ని డ్రిల్ చేసి ఉష్ణోగ్రతలను అంచనా వేయడం, మూన్ వాకర్స్ ధరించే స్పేస్ సూట్లపై మట్టి, ఇతర పార్టికల్స్​ను తొలగించేందుకు ఉపయోగపడేలా తయారు చేసిన పరికరాన్ని పరీక్షించడం వంటి ప్రయోగాలు చేపట్టనుంది. ఇందుకోసం ‘బ్లూ ఘోస్ట్’ పేరుతో 2 మీటర్ల పొడవైన ల్యాండర్ ను ఈ కంపెనీ పంపింది. ఇది వచ్చే మార్చిలో చంద్రుడిపై ఉత్తర భాగాన మేర్ క్రిసియమ్ ప్రాంతంలో దిగనుంది. ఇందులో 5 కిలోల బరువైన రోవర్ కూడా ఉంటుంది. ఇది ల్యాండర్ చుట్టూ మెల్లగా తిరుగుతూ పరిశోధనల్లో పాల్గొననుంది. ఇక ఐస్పేస్ కంపెనీ రెండేండ్ల క్రితం మొదటిసారి లూనార్ ల్యాండర్​ను ప్రయోగించగా, అది చంద్రుడిపై కూలిపోయింది. 

తాజాగా రెండోసారి ఆ కంపెనీ చంద్రుడి మట్టిని స్టడీ చేయడం, ఆహార, నీటి వనరుల అన్వేషణ కోసం ‘రెసీలియెన్స్’ పేరుతో ల్యాండర్​ను ప్రయోగించింది. ఇది 4 నుంచి 5 నెలల ప్రయాణం తర్వాత అంటే.. మే నెల చివరిలో లేదా జూన్​లో చంద్రుడి ఉత్తరాన మరింత దూరంగా మేర్ ఫ్రిగోరిస్ ప్రాంతంలో దిగనుంది. కాగా, ఇప్పటివరకూ చంద్రుడిపై రష్యా, అమెరికా, చైనా, జపాన్, ఇండియా మాత్రమే ల్యాండర్లను విజయవంతంగా దింపగలిగాయి. ఇక ప్రైవేట్ కంపెనీల విషయానికి వస్తే ఇప్పటికే నాసాతో కాంట్రాక్టులో భాగంగా హూస్టన్​కు చెందిన ‘ఇంటూషివ్ మెషీన్స్’ కంపెనీ గత ఏడాదిలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఓ ల్యాండర్​ను విజయవంతంగా దింపి చరిత్ర సృష్టించింది. వచ్చే నెల చివర్లో రెండో ప్రయోగానికి కూడా సిద్ధమవుతోంది.