- రాకెట్ను వదిలి కిందకు సేఫ్గా దిగొచ్చిన బూస్టర్.. ఆ తర్వాత నిమిషానికే పేలిపోయిన రాకెట్
- ఇప్పటిదాకా స్టార్ షిప్కు 7 టెస్టులు.. వాటిలో మూడే సక్సెస్
టెక్సస్: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ తయారు చేసిన ప్రపంచంలోనే అత్యంత భారీ రాకెట్ ‘స్టార్ షిప్’ మరోసారి ఫెయిల్ అయింది. గురువారం సాయంత్రం అమెరికాలోని టెక్సస్ స్టేట్ బొకా చికా తీరంలోని స్టార్ బేస్ నుంచి ప్రయోగించిన కొద్దిసేపటికే స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది. రాకెట్ను వదిలి కిందకు వచ్చిన బూస్టర్ మాత్రం సేఫ్గా లాంచ్ ప్యాడ్ వద్ద చోప్ స్టిక్స్ మధ్యలోకి ల్యాండ్ అయింది.
చంద్రుడు, అంగారక గ్రహానికి మనుషులను పంపే వ్యోమనౌకలను ప్రయోగించే లక్ష్యంతో స్పేస్ఎక్స్ కంపెనీ స్టార్ షిప్ రాకెట్ను తయారు చేసింది. ఏకంగా 123 మీటర్ల పొడవైన ఈ మెగా రాకెట్‌కు 2023, నవంబర్ 18న తొలి టెస్ట్ నిర్వహించగా అది లాంచ్ ప్యాడ్ వద్దే పేలిపోయింది. తర్వాత మరో రెండు టెస్టుల్లోనూ రాకెట్ ఫెయిలైంది. నాలుగు, ఐదు, ఆరో టెస్టులు విజయవంతం కాగా, మళ్లీ ఇప్పుడు ఏడో టెస్టులో బూస్టర్ సేఫ్గా దిగి వచ్చినా, రాకెట్ పేలిపోయింది. గురువారం నాటి ప్రయోగంలో సరిగ్గా 7 నిమిషాలకు రాకెట్ ను విడిచిపెట్టిన బూస్టర్ వెనక్కి వచ్చి లాంచ్ ప్యాడ్ చోప్ స్టిక్స్ మధ్యలోకి చేరింది. కానీ మరో నిమిషంలోనే ఈ సంతోషం ఆవిరైపోయింది. సరిగ్గా 8 నిమిషాల తర్వాత 146 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 21 వేల కిలోమీటర్ల వేగంతో రాకెట్ దూసుకెళ్తుండగా.. కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి.
రాకెట్లోని రాప్టార్ ఇంజన్లు ఒకదాని వెంట ఒకటి వరుసగా షట్ డౌన్ అయ్యాయి. దీంతో తిరిగి భూవాతావరణంలోకి పడిపోయిన రాకెట్ పేలి ముక్కలైంది. దీనిలో ఉన్న పది డమ్మీ శాటిలైట్లు కూడా మండుతూ సముద్రంలో పడ్డాయి. రాకెట్ పేలిపోయి, శకలాలు నిప్పుల్లా రాలిపడ్డ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిలో ఓ వీడియో క్లిప్‌ను మస్క్ కూడా ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘సక్సెస్ దక్కుతుందా లేదా చెప్పలేం. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ” అని చమత్కరించారు. రాకెట్ పైభాగంలో ఫ్యూయెల్ లీక్ వల్లే ఈ ఫెయిల్యూర్ చోటుచేసుకున్నట్టు గుర్తించామన్నారు. కాగా, రాకెట్ పేలిపోయి, శకలాలు పడిన ప్రాంతం గుండా తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆ సమయంలో ఆ రూట్లో వెళ్లాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు.