స్పేస్​ జంక్​తో ముప్పు

స్పేస్​ జంక్​తో ముప్పు

మొన్నామధ్య స్పేస్​ఎక్స్​ సంస్థ మెరుగైన ఇంటర్నెట్​ సేవల కోసం ఒకేసారి 60 ఉపగ్రహాలను (స్టార్​లింక్​ శాటిలైట్​) నింగిలోకి పంపింది. అంతేకాదు, రాబోయే కొన్నేళ్లలో వేలాది శాటిలైట్లను పంపేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ముమ్మరంగా ప్రయోగాలు చేస్తోంది. జూలైలో చంద్రయాన్​ 2 ప్రయోగానికి కసరత్తులు చేస్తోంది. ఆ తర్వాత మనిషిని రోదసికి పంపే మరో మహత్తర కార్యానికీ శ్రీకారం చుట్టబోతోంది. అవిగాకుండా ఉపగ్రహ ప్రయోగాలూ ఉంటాయి. నాసా 2024 నాటికి చంద్రుడిపైకి రెండోసారి మనిషిని పంపే ప్రయోగం చేయబోతోంది. అమెజాన్​, వన్​వెబ్​ లాంటి సంస్థలూ అలాంటి ఆలోచనల్లోనే ఉన్నాయి.

గతి తప్పితే ముప్పు

అయితే, ఇప్పటికే స్పేస్​లో లక్షలాది ఉపగ్రహ, రాకెట్​ శకలాలు ఇబ్బడిముబ్బడిగా చక్కర్లు కొడుతున్నాయి. వేలాది శాటిలైట్లున్నాయి. అంతేనా, వివిధ దేశాలు (భారత్​ సహా) యాంటీ శాటిలైట్​ మిసైల్స్​ను ప్రయోగిస్తున్నాయి. వాటి వల్ల స్పేస్​లో జంక్​ మరింత ఏర్పడే ప్రమాదముంది. ఏదో ఒక ఉపగ్రహంగానీ, ఏదైనా శకలంగానీ గతి తప్పి ఇంకో దాన్ని, అది మరొక దాన్ని ఢీకొట్టేస్తే పరిస్థితేంటి? ధ్వని కన్నా 23 రెట్ల వేగంతో దూసుకెళ్లి చైన్​సిస్టంలో ఒకదాన్ని ఒకటి ఢీకొంటే అన్నీ పేలిపోతాయి. అలా అలా భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలోని శకలాలు, ఉపగ్రహాలు నాశనం అవుతాయి. వేల కోట్ల రూపాయలతో కక్ష్యలో పెట్టిన స్టార్​లింక్​, ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​ (ఐఎస్​ఎస్​) వంటివీ అందుకు మినహాయింపేమీ కాదు. తద్వారా అంతరిక్షం నాశనమైపోయిన ఉపగ్రహాలు, రాకెట్లతో శ్మశానంలా మారుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. దాని వల్ల జీపీఎస్​ సేవలు నిలిచిపోతాయి. వాతావరణాన్ని అంచనా వేసే టెక్నాలజీ పోతుంది. విమానాలు గాల్లోకి లేవవు. టీవీలు, ఫోన్లు పనిచేయవు. ఇంటర్నెట్​ రాదు. దేశాల ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైపోతుంది. ఇప్పటికిప్పుడు వాటితో వచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినా భవిష్యత్​ తరాలకు అది పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంటుందని హార్వర్డ్​ స్మిత్సోనియన్​ సెంటర్​ ఫర్​ ఆస్ట్రోఫిజిక్స్​ ఆస్ట్రానమర్​ జొనాథన్​ మెక్​డోవెల్​ చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల ఖర్చులు తగ్గిపోతుండడంతో ఏటా ఉపగ్రహ ప్రయోగాలు పెరిగిపోతున్నాయని, అదే జరిగితే ఇంకా కొన్ని వేల ఉపగ్రహాలు స్పేస్​లోకి చేరిపోతాయని వివరిస్తున్నారు. ఇప్పుడున్న ఉపగ్రహాలకు పదిరెట్లు ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపితే దాని వల్ల కలిగే ముప్పు 100 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. అంతేకాదు, స్పేస్​ జంక్​తో కాలుష్యం, వాతావరణ మార్పులు తలెత్తుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ముప్పులను తప్పించాలంటే అర్జెంట్​గా స్పేస్​ ప్రయోగాలను తగ్గించాల్సిన అవసరం ఉందని, దానికి కఠినమైన నిబంధనలను ఏదేశానికి ఆదేశం రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేగాకుండా అంతరిక్షంలో పేరుకుపోయిన శకలాలను తీసేయాల్సి ఉంటుందంటున్నారు. అంటే అంతరిక్షాన్ని క్లీన్​ చేయడం.