మళ్లీ పేలిన మస్క్ రాకెట్.. ఎనిమిదో ప్రయోగంలోనూ స్టార్ షిప్ ఫెయిల్

మళ్లీ పేలిన మస్క్ రాకెట్.. ఎనిమిదో ప్రయోగంలోనూ స్టార్ షిప్ ఫెయిల్

బ్రౌన్స్​విల్లే(యూఎస్): చంద్రుడు, మార్స్ పైకి మనుషులను పంపేందుకు బిలియనీర్ ఎలాన్ మస్క్​కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్టార్ షిప్ రాకెట్ మరోసారి పేలిపోయింది. ఈ ఏడాది జనవరిలో ఏడో ప్రయోగంలో కూడా ఈ రాకెట్ అప్పర్ స్టేజ్ పేలిపోవడంతో శకలాలు మండుతూ కరీబియన్ దీవుల వద్ద అట్లాంటిక్ సముద్రంలో పడ్డాయి. ఎనిమిదో ఫ్లైట్ టెస్ట్​లో భాగంగా గురువారం సాయంత్రం టెక్సాస్ లోని బొకాచికా నుంచి 123 మీటర్ల ఎత్తయిన స్టార్ షిప్ రాకెట్​ను స్పేస్ఎక్స్ ప్రయోగించింది. 

ఈసారి కూడా రాకెట్ అప్పర్ స్టేజ్​ను నిర్దేశిత దూరం వరకూ పైకి తీసుకెళ్లిన బూస్టర్ ఆ తర్వాత వేరుపడి సేఫ్​గా దిగొచ్చి క్రేన్ హ్యాండిల్స్ మధ్య ల్యాండ్ అయింది. అనంతరం కొద్ది నిమిషాలకు భూమికి 150 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన రాకెట్ అప్పర్ స్టేజ్​లో అకస్మాత్తుగా ఇంజన్లు షట్ డౌన్ అయ్యాయి. 

ఆ వెంటనే రాకెట్ గింగిరాలు తిరిగింది. దాని భాగాలన్నీ వేగంగా డిస్ అసెంబుల్ అయ్యాయి. ఆ వెంటనే రాకెట్ పేలిపోవడంతో దాని శకలాలు మండుతూ ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతంలో సముద్రంలో పడ్డాయి. రాకెట్ శకలాలు కనిపించిన ప్రాంతాల్లో తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. 

రెండు నెలల్లో రెండోసారి.. 

జనవరిలో జరిగిన ప్రయోగం సందర్భంగా రాకెట్ అప్పర్ స్టేజ్​లో ఫ్యూయెల్ లీక్ కావడం వల్ల రాకెట్ ఆటోమేటిక్​గా సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిందని స్పేస్ఎక్స్ వర్గాలు వెల్లడించాయి. తాజా ప్రయోగంలోనూ లోపాలు తలెత్తడంతో రాకెట్ పేలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం.. స్టార్ షిప్ రాకెట్ అంతరిక్షానికి చేరిన తర్వాత డమ్మీ శాటిలైట్లను కక్ష్యలోకి విడుదల చేయాలి. ఆ తర్వాత భూమి చుట్టూ ఒక రౌండ్ వేశాక, దానిలోని క్రూమాడ్యూల్ హిందూ మహాసముద్రంలో పడిపోవాలి.  కానీ ఇటీవలి ప్రయోగాల్లో బూస్టర్ స్టేజీ మాత్రమే సక్సెస్ అవుతూ, రాకెట్ అప్పర్ స్టేజీ మాత్రం ఫెయిల్ అవుతూ పేలిపోతోంది.

చంద్రుడు, మార్స్ పైకి మనుషులను పంపేందుకు ఎలాన్ మస్క్​కు చెందిన స్పేస్ఎక్స్ తయారు చేసిన స్టార్ షిప్ రాకెట్ మళ్లీ పేలింది. ఈ ఏడాది జనవరిలో ఏడో ప్రయోగంలో కూడా ఈ రాకెట్ అప్పర్ స్టేజ్ పేలిపోవడంతో శకలాలు మండుతూ కరీబియన్ దీవుల వద్ద అట్లాంటిక్ సముద్రంలో పడ్డాయి.