Euro 2024 final: యూరో విజేత స్పెయిన్.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌పై గెలుపు

Euro 2024 final: యూరో విజేత స్పెయిన్.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌పై గెలుపు

నెల రోజుల పాటు క్రీడా అభిమానులను అలరించిన యూరో కప్ 2024 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో గెలిచి ఈ టోర్నీని నాలుగోసారి సొంతం చేసుకుంది. టోర్నీ అంతటా ఓటమి లేని జట్టుగా ఫైనల్ కు చేరిన స్పెయిన్.. తుది సమరంలోనూ అదే జోరు కనబర్చింది. 12 ఏళ్ళ తర్వాత స్పెయిన్ యూరో టైటిల్ ను గెలిచింది. చివరిసారిగా స్పెయిన్ 2012 లో యూరో టైటిల్ గెలిచింది. 2016 లో పోర్చుగల్.. 2020లో ఇటలీ యూరో టైటిల్ ను సొంతం చేసుకున్నాయి.

ఓవరాల్ గా స్పెయిన్ కు ఇది నాలుగో యూరో టైటిల్. 1964, 2008, 2012, 2024 లో స్పెయిన్ టైటిల్స్ నెగ్గింది. మరోవైపు ఇంగ్లాండ్ కు యూరో టైటిల్ గెలవాలనే కల కలగానే మిగిలిపోయింది. వరుసగా రెండో సారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2020 లోనూ ఫైనల్ కు చేరిన ఇంగ్లాండ్.. తుది సమరంలో ఇటలీ చేతిలో ఓడిపోయింది. బలమైన జట్టుగా పేరున్న ఇంగ్లాండ్ ఇప్పటివరకు యూరో టైటిల్ గెలవకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రారంభంలో ఇరు జట్లూ తమ ఆటను నిదానంగా ప్రారంభించాయి. దూకుడుగా ఆడకపోవడంతో తొలి అర్ధభాగంలో ఇరు జట్లకు గోల్ చేయలేదు. రెండో అర్ధభాగంలో అసలైన ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్‌ పై ఆధిపత్యం చూపిస్తూ 47వ నిమిషంలో నికో విలియమ్స్ గోల్ చేశాడు. దీంతో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ALSO READ : పాకిస్తాన్​ను ఓడించి డబ్ల్యూసీఎల్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండియా

ఇంగ్లండ్ తరఫున కోలె పాలెమెర్ 73వ నిమిషంలో  గోల్ కొట్టి స్కోర్ ను సమం చేశాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా  మైకెల్ ఒయర్జాబల్ 86వ నిమిషం గోల్ కొట్టి స్పెయిన్ ను 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఎలాంటి గోల్స్ నమోదు కాకపోవడంతో 2-1 తేడాతో స్పెయిన్ మ్యాచ్ తో పాటు ట్రోఫీని గెలుచుకుంది.