మాడ్రిడ్: మోడరన్ లైఫ్ లో ఎదురవుతున్న అనేక సవాళ్లలో స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ ఒకటి. పరిమితికి మించి ఫోన్ వాడటం వల్ల నిద్ర, మానసిక ఆరోగ్యంతోపాటు వ్యక్తిగత సంబంధాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీనేజర్స్, యువతలో స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో స్పెయిన్ ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నది. స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని "పబ్లిక్ హెల్త్ ఎపిడెమిక్"గా గుర్తించింది. అంతేగాక..సిగరెట్ పెట్టెలపై ఉండే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ మాదిరిగా దేశంలో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లపై "స్మార్ట్‌ఫోన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్" అని హెల్త్ వార్నింగ్ మేసేజ్ లు, గుర్తులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. తద్వారా ఎక్కువసేపు ఫోన్ స్క్రీన్ చూస్తే కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించడంతోపాటు మరింత జాగ్రత్తగా ఫోన్ ఎలా వినియోగించాలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ మేరకు స్మార్ట్ ఫోన్ల వాడకం, నియంత్రణపై స్టడీకి ఓ నిపుణుల కమిటీని వేసింది. ఈ కమిటీ ఇటీవల 250 పేజీల రిపోర్టును స్పెయిన్ ప్రభుత్వానికి అందించింది.
చిన్నారులు ఫోన్లు వాడకుండా కంప్లీట్ బ్యాన్
స్మార్ట్‌ఫోన్‌లపై హెల్త్ కన్సర్న్ వార్నింగ్ లేబుల్స్ తప్పనిసరిగా వేయాలని ప్రభుత్వానికి రిపోర్టు సూచించింది. మూడేండ్ల చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడకుండా కంప్లీట్ గా బ్యాన్ చేయాలని సిఫార్సు చేసింది. ఆరేండ్లలోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్ల వాడకం చాలావరకు పరిమితం చేయాలని తెలిపింది. 12 ఏండ్లలోపు పిల్లలను సోషల్ మీడియా వినియోగానికి దూరంగా ఉంచాలని సలహా ఇచ్చింది. ఇక టీనేజర్లకు అంతగా అవసరమైతే డంబ్ ఫోన్లు(బేసిక్) మాత్రమే అందుబాటులో ఉంచాలని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లలో యాప్ ల వాడకం తగ్గించాలని .. అనవసర కంటెంట్ ఉన్న యాప్ లకు పిల్లలను దూరంగా ఉంచాలని వెల్లడించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్ వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో టీనేజర్లను యాక్సెస్ చేయకుండా, ఖాతాలను సృష్టించకుండా నిరోధించాలని చెప్పింది. లేదా వయసు పరిమితితో సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేస్తూ కొత్త చట్టం తీసుకురావాలని సలహా ఇచ్చింది. లేకుంటే పిల్లలపై వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని కమిటీ హెచ్చరించింది.