
ఈ ఒలింపిక్స్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్రెంచ్ స్టీఫుల్‌చేజ్ రన్నర్ అలిస్ ఫినోట్.. తన ప్రియుడికి ప్రపోజ్ చేసి మెగా గేమ్స్‌ను చిరస్మరణీయం చేసుకుంది. మంగళవారం స్టీఫుల్‌చేజ్ రేస్ ముగిసిన తర్వాత స్టాండ్‌లో ఉన్న తన ప్రియుడు స్పెయిన్ ట్రయాథ్లాన్ బ్రూనో మార్టినెజ్ దగ్గరికి వెళ్లిన ఫినోట్ మోకాలిపై కూర్చొని రింగ్‌తో ప్రేమను వ్యక్తం చేసింది. అతని చొక్కాపై ‘లవ్ ఈజ్ ఇన్ పారిస్’ అని పిన్‌ను జత చేసింది.
‘తొమ్మిది నా అదృష్ట సంఖ్య. మేం తొమ్మిదేళ్లుగా రిలేషన్‌లో ఉన్నాం. ఈ రేస్‌ను తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసి నా బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయాలి అనుకున్నా’ అని ఫినోట్‌వెల్లడించింది. అనుకున్నట్లుగానే ఆమె రేస్‌ను 8ని, 58.67 సెకన్లలో ముగించి నాలుగో ప్లేస్‌లో నిలిచింది. ఆ వెంటనే ప్రియుడి వద్దకు వెళ్లి ప్రపోజ్ చేసింది. దీనికి అంగీకరించిన మార్టినెజ్ కౌగిలింత, చుంబనంతో తన ఇష్టాన్ని తెలిపాడు. ప్రేమను అందరిలాగా వ్యక్తం చేయడం తనకు ఇష్టం లేదని అందుకే ఈ విధంగా తెలియజేశానని ఫినోట్ తెలిపింది.