వామ్మో.. ఇవెక్కడి వరదలు.. స్పెయిన్లో 95 మందిని పొట్టనపెట్టుకున్నయ్..

వామ్మో.. ఇవెక్కడి వరదలు.. స్పెయిన్లో 95 మందిని పొట్టనపెట్టుకున్నయ్..

స్పెయిన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు ఆ దేశాన్ని ముంచెత్తడంతో ఇప్పటికి 95 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా స్పెయిన్లోని సుందర నగరాలు బురదతో నిండిపోయాయి. స్పెయిన్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. 1996 తర్వాత స్పెయిన్లో ఈ స్థాయిలో వరదలు రావడం మళ్లీ ఇప్పుడేనని తెలిసింది. స్పెయిన్ ను భారీ వర్షాలు, వరదలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.

ఇక.. తైవాన్ను కూడా భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. సూపర్ తైపూన్ కాంగ్-రే తుఫాన్ తైవాన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ తుఫాన్ కారణంగా తైవాన్ పూర్తిగా లాక్డౌన్ సమయంలో మాదిరిగా షట్డౌన్ అయింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

400 విమానాలు తాత్కాలిక రద్దయ్యాయి. 18 వేల ఇళ్లు అంధకారంలో కూరుకుపోయాయి. దాదాపు 8600 మందిని వారి ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  స్పెయిన్లో వరద వల్ల జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. మలగా నుంచి వాలెన్సియా వరకు దక్షిణ, తూర్పు స్పెయిన్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. 

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇండ్లు, అపార్ట్​మెంట్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. హఠాత్తుగా వచ్చిన వరదలతో జనజీవనం అతలాకుతలం అయ్యింది. నదులన్నీ పొంగి వీధులను ముంచెత్తాయి. రైల్వే లైన్స్, రోడ్లన్నీ నీటమునిగాయి. ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది చెట్లు ఎక్కారు. అలాగే, ఎత్తైన భవనాలపైకి చేరుకున్నారు.