ఆన్సర్లన్నీ పెన్నుల మీద చెక్కుకొచ్చిన స్పెయిన్​ స్టూడెంట్

ఆన్సర్లన్నీ పెన్నుల మీద చెక్కుకొచ్చిన స్పెయిన్​ స్టూడెంట్
  • ఎగ్జామ్​లో నకలు కొట్టేందుకు స్పెయిన్​ లా స్టూడెంట్ యత్నం.. ఫొటో వైరల్

మాడ్రిడ్: నకల్ కొట్టనింకె గూడ అకల్ (తెలివి) కావాలె అని ఓ సామెత. స్పెయిన్​లో లా చదువుతున్న గోంజో అనే ఓ స్టూడెంట్ కూడా బాగా టఫ్ గా ఉండే క్రిమినల్ ప్రొసీజర్ లా ఎగ్జాంల ఎట్లయినా నకల్ కొట్టి పాసవ్వాలని డిసైడ్ అయిండు. చిట్టీలు, చేతులు, కాళ్లపై రాస్కోవడాలన్నీ పాత టెక్నిక్ అనుకున్నడేమో.. అందుకే తెలివిగా 11 పెన్నులు తీసుకున్నాడు. ఇంపార్టెంట్ పాయింట్లు అన్నింటినీ ఆ పెన్నులపై చిన్నచిన్న అక్షరాలుగా చెక్కిండు. అయితే, ఎగ్జాం హాల్ లో ప్రొఫెసర్ యోలండా డీ లూషీకి ఇట్టే దొరికిపోయాడు. మొదట నార్మల్ పెన్నులే అనుకున్న ఆ  ప్రొఫెసర్.. కొంచెం జాగ్రత్తగా పరిశీలించడంతో వాటిపై అక్షరాలు కన్పించాయి. ఇంకేం.. అన్ని పెన్నులపై అక్షరాలను చదివితే అసలు విషయం తెలిసిపోయింది. ఆ ప్రొఫెసర్ ఇటీవల ట్విట్టర్ లో ఈ నకల్ పెన్నుల ఫొటోను ట్వీట్ చేయడంతో తెగ వైరల్ అయిపోయింది.

24 వేల మంది రీట్వీట్ చేయగా.. 3.8 లక్షల లైకులు వచ్చాయి. ఇక చాలా మంది నెటిజన్ లు మాత్రం ‘‘అంత కష్టపడి చెక్కేంత టైమేదో చదివేందుకు కేటాయిస్తే సరిపోయేది కదా” అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక గోంజోను ఆ ప్రొఫెసర్ ఎగ్జాం హాల్ నుంచి గెంటేయలేదట. అతని దగ్గరి పెన్నులన్నీ గుంజుకుని.. పెన్సిల్ చేతిలో పెట్టి ఎగ్జాం రాయమన్నాడట.