- జార్ఖండ్లో ఘటన.. ముగ్గురి అరెస్టు..
- భర్తతో కలిసి టూర్కు వచ్చిన స్పెయిన్ యువతి
దుమ్కా: జార్ఖండ్లో దారుణం జరిగింది. టూర్ కు వచ్చిన స్పెయిన్ మహిళపై కొందరు స్థానిక యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. స్పెయిన్ కు చెందిన మహిళ(28), ఆమె భర్త(64) రెండు బైక్ లపై వరల్డ్ టూర్ చేస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్ లోకి ఎంటర్ అయ్యారు. రాష్ట్రంలోని దుమ్కా జిల్లా నుంచి బీహార్ కు వెళ్లి, అక్కడి నుంచి నేపాల్ లోకి ఎంటర్ కావాలని షెడ్యూల్ వేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుమ్కా జిల్లాలోని కురుమహత్ ఏరియాలో రోడ్ సైడ్ టెంట్ వేసుకుని బస చేశారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో స్థానికులు కొందరు అక్కడికి వచ్చారు. మహిళ భర్తపై దాడి చేసి, ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అటువైపు వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది గాయాలతో ఉన్న టూరిస్టులను గమనించారు. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు.
సిట్ ఏర్పాటు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ శనివారం తెలిపారు. కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పట్టుకున్నామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనను అసెంబ్లీలో లేవనెత్తాయి.