బాలు ప్రతి పాట.. మాట.. ఓ ప్రయోగం

పాటల చంద్రుడి ప్రయోగాలు ఎన్నెన్నో..

తెరపై ఎంతో మంది సక్సెస్​ వెనుక బాలు వాయిస్​ ఉంది.  సాధారణంగా ఆర్టిస్టులకు ఎవరైనా పాడగలరు.. డబ్బింగ్ చెప్పగలరు. కానీ, ఆ ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్​కి.. వాళ్లు పోషించిన క్యారెక్టర్లకు తగ్గట్లు వాయిస్​ ఇవ్వడం అనేది ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్​ ఫేస్​ చేసే జర్నీలో ఎన్నో ప్రయోగాలు చేసిన లెజెండ్​ ఎస్పీబీ.

ఆయన పాడిన ప్రతీ పాటా ఒక ఆణిముత్యమైతే.. ఆ పాటలో కనిపించే ఆర్టిస్ట్​కి తగ్గట్లుగా మాడ్యులేషన్​ మార్చేసి పాడడం ఎస్పీబీకి మాత్రమే సొంతమైన ప్రత్యేకత. పాడడమే కాదు.. దాదాపు అన్నిభాషల్లోని కొందరు ఆర్టిస్టులకు డబ్బింగ్‌‌ కూడా చెప్పి అలరించారాయన.  తెరపై చూసిన తర్వాత ‘అది బాలుగారి వాయిస్​’ అని తెలిశాక.. మోసపోయిన ఆడియెన్స్​ కనుబొమ్మలు ఎగరేసిన సందర్భాలు ఎన్నో.  అలాంటి ఎస్పీబీ కెరీర్​లో ప్రయోగాలు చాలానే ఉన్నాయి.

క్లాసిక్​ మ్యూజిక్ నేర్చుకోకపోయినా ‘శంకరాభరణం’ కోసం ‘ఓంకార నాదాను’ పాట పాడడం ఒక ఎత్తు అయితే.. ఆ పాటకి ఏకంగా ‘నేషనల్ బెస్ట్​ సింగర్’​ అవార్డు గెల్చుకోవడం మరో ఎత్తు. పాటలు పాడుతూనే అన్నిరకాల సంగీతాల్ని ప్రాక్టీస్ చేశాడాయన. ‘సింగర్​ కావాలంటే సరిగమలు నేర్వడం తప్పనిసరి అనేం లేదు..  పాడాలనే కోరిక బలంగా ఉంటే చాలు’ అని ఎందరినో భుజం తట్టి ప్రోత్సహించిన వ్యక్తి ఎస్పీబీ.  అంతేకాదు సింగర్ అంటే కేవలం పాట మాత్రమే పాడాలి అనే గిరిని చెరిపేసి.. కొత్త పంథాను క్రియేట్ చేశారు. పాటలు పాడుతూ బిజీగా ఉన్నా.. అలసిపోకుండా రికార్డింగ్ రూమ్​లో హుషారుగా ఉండేవాడు బాలు. కంపోజర్లకు ఆయనలో నచ్చిన క్వాలిటీ కూడా ఇదే.  అందుకే తమ సినిమాలోని పాటకి బాలు గాత్రం కచ్చితంగా తోడవ్వాలని అనుకునేవాళ్లట మ్యూజిక్ డైరెక్టర్లు.

హీరోకొక్క తీరు

ఆర్టిస్టులకు అనుగుణంగా పాటల్ని, వాయిస్​ డబ్బింగ్ చెప్పే మాడ్యులేషన్  మొదలుపెట్టింది బాలునే.  కెరీర్​ కొత్తలో ఓ పెద్ద హీరోకి పాటపాడడం.. ఆ వాయిస్​ బాగోలేదని ఆ హీరో ఫ్యాన్స్​ గొడవ చేయడం..  తిరిగి అదే హీరోకి మాడ్యులేషన్​ మార్చేసి, గొంతు మార్చేసి పాడడం, ఆ పాట సూపర్ హిట్ కావడంతో బాలుగారికి విషయం అర్థమైంది. పెద్ద హీరోలకు పాడాలంటే.. వాళ్లను ఇమిటేట్​ చేయకతప్పదని డిసైడ్ అయ్యారు ఆయన. అప్పటి నుంచి ఆర్టిస్ట్​ల సోల్​ను పట్టుకుని.. పాటలు పాడడం ప్రారంభించారాయన. ఎన్జీఆర్​కి ఒక స్టైల్, ఏఎన్నార్‌‌‌‌కి ఒక స్టైల్​, చిరుకి ఒక స్టైల్, బాలయ్యకి ఒక స్టైల్..  ఇలా హీరో హీరోకి ఒక్కో స్టైల్​తో పాటలు పాడిన స్పెషాలిటీ ఎస్పీబీది. క్యారెక్టర్​ ఫీలింగ్..  ఆ సాంగ్​ సిచ్యుయేషన్​ని బట్టి తన గొంతులో మార్పులు కూడా చేసుకునేవాడు ఆయన.  పాడడమే కాదు.. మధ్యమధ్యలో ఆ హీరోల బాడీలాంగ్వేజ్​కి తగ్గట్లు లిరికల్​ డైలాగులు కూడా చెప్పి ఆడియెన్స్​ని హుషారెత్తించేవారు. స్ట్రెయిట్ సినిమాలే కాదు.. డబ్బింగ్ సినిమాలకూ ఆయన ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యేవారు.  సల్మాన్​ ఖాన్‌‌కి బాలీవుడ్‌‌లో స్టార్​ హీరోగా పునాది పడటానికి బాలు పాడిన పాటలే కారణం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రాసి.. పాడారు

నాలుగు భాషల్లో 46 సినిమాలకు మ్యూజిక్​ డైరెక్టర్‌‌‌‌గా పని చేశాడు బాలు. తెలుగులో జంధ్యాల డైరెక్షన్‌‌లో వచ్చిన ‘పడమటి సంధ్యారాగం’ ఒక ప్రయోగం. అప్పట్లోనే పూర్తిగా ఫారిన్​లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ‘లైఫ్ ఈజ్​ షబ్బీ విత్అవుట్ యూ’ అనే ఇంగ్లీష్ పాట మరో ప్రయోగం. ఆ పాటను స్వయంగా రాసింది.. పాడింది ఎస్పీబీ.

మాటే మంత్రం

బాలు పాట మాత్రమే కాదు.. గొంతు కూడా అమృతమే. ఎంతో మంది ఆర్టిస్టులకు వాయిస్ ఓవర్ ఇచ్చారాయన. 1976లో కమల్ హాసన్​ ‘మన్మధ లీలై’(తెలుగులో మన్మధ లీల)తో  అనుకోకుండా మొదలైన బాలు డబ్బింగ్ జర్నీ..  చివరిదాకా కొనసాగింది. సీనియర్​ నరేష్​(నాలుగుస్తంభాలాట), విసు, గిరీశ్ కర్నాడ్, జెమినీ గణేశన్​, టిను ఆనంద్​(ఆదిత్య 369), సుమన్(అన్నమయ్య), మోహన్​లాల్(ఇద్దరు), అర్జున్​(శ్రీ ఆంజనేయం), అతడు(నాజర్​), రజనీకాంత్​(కథానాయకుడు).. ఇలా తెలుగు సినిమాలకుగానూ ఎందరికో ఆయన వాయిస్ ఇచ్చారు.  ‘గాంధీ’(1982) తెలుగు వెర్షన్​, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ తమిళ్ వెర్షన్​లో అనిల్​ కపూర్​కి,  ‘శ్రీరామరాజ్యం’ ​తమిళ్ వెర్షన్ లో బాలకృష్ణకి వాయిస్ ఇచ్చింది బాలునే. భాష ఏదైనా సరే.. యాక్టర్ ఎవరైనా సరే.. వాళ్ల పర్సనాలిటీకి తగ్గట్లు ఎమోషన్స్‌‌ని తన వాయిస్​తో ఆడియెన్స్​ కళ్ల ముందు ఉంచడం ఆయనకి ఉన్న స్పెషాలిటీ.  ఒక ‘వాయిస్​ ఓవర్​ యాక్టర్‌‌’‌‌గా ఆయన వర్క్​ను ఎవరూ రీక్రియేట్ చేయలేరన్నది చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పే మాట.

కమల్‌‌తోనే ఎక్కువ

ఎస్పీ బాలు డబ్బింగ్ కెరీర్​ మొదలైంది కమల్ హాసన్​ సినిమాతోనే. అలాంటి కమల్ కెరీర్​ పీక్స్​కి చేరడంలో ఎస్పీబీ రోల్ చాలానే ఉంది. తెలుగులో కమల్ డబ్ సినిమాలు సూపర్​ హిట్ కావడంలో బాలు వాయిస్​ ‘కీ’ రోల్ పోషించింది. ముఖ్యంగా హ్యూమర్​ క్యారెక్టర్లకు వాయిస్ ఇవ్వడం డబ్బింగ్ ఆర్టిస్టులకు చాలా టఫ్​ టాస్క్. అలాంటిది కమల్ సినిమాలకు బాలు తనలోని చలాకీతనం ప్రదర్శించి మరీ డబ్బింగ్ చెప్పి..  ఆ పనిని చాలా ఈజీగా చేసేశారు. ‘క్షత్రియపుత్రుడు’, ‘అభయ్’​లో రెండు క్యారెక్టర్స్​కి, ‘విచిత్ర సహోదరులు’లో మూడు క్యారెక్టర్స్​కి, ‘మైకేల్ మదన కామరాజు’లో నాలుగు క్యారెక్టర్లకి, ‘దశావతారం’లో  ఏకంగా ఏడు క్యారెక్టర్లకి వాయిస్ ఇవ్వడం ఎస్పీబీ పనితనానికి ఒక ఎగ్జాంపుల్.  అన్నేసి క్యారెక్టర్లకు డబ్బింగ్ చెప్పారంటే.. బాలు మెంటల్​గా ఎంత స్ట్రాంగ్‌‌గా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు.  అయితే కమల్​కి ‘తెలుగు వాయిస్​’గా మారిన బాలు..  రెండు సినిమాలకు మాత్రం సింగర్​ మనోని రికమండ్ చేయడం విశేషం. ‘సతీ లీలావతి’, ‘బ్రహ్మచారి’…ఈ రెండు మూవీస్​లో కమల్ క్యారెక్టర్లు కోయంబత్తూరు, మదరాసీ​ యాసలో మాట్లాడుతుంటాయి.  అందుకే ఆ యాసకి తగ్గట్లు మనోతో డబ్బింగ్ చెప్పించాలని బాలునే రికమండ్ చేశాడంట.

రిస్క్ కూడా..

ఎస్పీబీ కెరీర్​లో లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. సింగర్ శంకర్ మహదేవన్​ కంటే కొన్నేళ్లు ముందుగానే ‘బ్రీత్ లెస్’​ పాటతో అలరించాడు ఎస్పీబీ. ‘ఓ పాపాలాలి’ (ఒరిజినల్ వెర్షన్​ ‘కెలాడి కణ్మణి’లో మణ్ణిల్ ఇంత.. సాంగ్) ‘మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు..’ పాటలో చరణాల్ని గుక్కతిప్పుకోకుండా పాడి.. మెప్పించారాయన. కమల్ హాసన్​ కెరీర్​లో ‘విక్రమ్’(1986)​ ఒక స్పెషల్ మూవీ. ఈ మూవీ తెలుగులో ‘ఏజెంట్ విక్రమ్‌‌’గా డబ్ అయ్యింది.  ఆ మూవీలో హీరో సలామియా రాజ్యానికి వెళ్లినప్పుడు ఒక పాట ఉంటుంది. అందులో బాలీవుడ్ నటుడు అంజద్ ఖాన్, కోలీవుడ్ కమెడియన్ జనగరాజ్​, కమల్ హాసన్.. ఈ ముగ్గురికి తన వాయిస్​తోనే.. మాడ్యులేషన్​ చేంజ్ చేసి పాడారు బాలు.  పాట కోసం ప్రాణమిచ్చే ఎస్పీబీ..  ప్రయోగాలతో పాటు రిస్క్​ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  ‘ఇంద్రుడు.. చంద్రుడు’లో ‘నచ్చిన ఫుడ్డు.. వెచ్చని బెడ్డు’  పాట కోసం టోన్ మార్చి  పాటపాడారు బాలు. ఆ పాట వల్ల ఆయన గొంతు బొంగురు పోయి చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత సర్జరీ చేయించుకుని.. కొంతగ్యాప్ తీసుకుని మళ్లీ పాటలు పాడడం మొదలుపెట్టారు. పౌరాణిక సినిమాలకు పాటలకు వాయిస్​ ఇచ్చే విషయంలో ఆయన రిస్క్​ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మిరాకిల్ వాయిస్​లో ఎన్నో ప్రత్యేకతలు..

బాలుకి వాయిస్!!

బాలు..  సింగర్​, డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌ మాత్రమే కాదు.. నిర్మాతగా, మ్యూజిక్​ డైరెక్టర్‌‌‌‌గా మల్టీటాలెంటెడ్. నటుడిగా కూడా ఎన్నో సినిమాలతో అలరించాడు. ఆయన యాక్టింగ్​లో కామెడీ టైమింగ్ బాగుంటుంది కూడా. తాను యాక్ట్ చేసిన సినిమాల్లో పాటలు పాడడమే కాదు..  ఒక్కోసారి వేరే ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌‌గా ‘అవ్వయ్​ షణ్ముగి’ తెలుగు వర్షన్​ ‘భామనే సత్యభామనే’లో కమల్ హాసన్​కి  డబ్బింగ్ చెప్పడమే కాదు(భామ క్యారెక్టర్​కి కూడా).. ఆ మూవీలో బాలు డాక్టర్ రోల్‌‌లో యాక్ట్ చేశారు కూడా.  అక్కినేని నాగార్జున తమిళ్ మూవీ ‘రచ్చగన్’ (రక్షకుడు)లో బాలు నాగ్‌‌కి ఫాదర్​ క్యారెక్టర్ చేశారు. ఆ మూవీలో ‘లక్కీ.. లక్కీ’ అనే సాంగ్‌‌లో నాగార్జునకి బాలు వాయిస్ ఇవ్వగా​..  బాలుకి మాత్రం బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్‌‌తో వాయిస్ ఇప్పించాడు ఏఆర్​ రెహ్మాన్​.

రాజా బాణీలో..

ఇళయరాజా సంగీతం.. బాలసుబ్రహ్మణ్యం గాత్రం.. కోట్ల మందికి ఇదొక ఫేవరెట్ కాంబి నేషన్​. రాత్రిళ్లు ఈ కాంబోలో వచ్చిన పాటలు వింటూ మైమరిచి నిద్రపోయేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు.  ఇద్దరి కాంబోలో వందల పాటలు.. అన్నీ సూపర్​ హిట్లే.  అంతేకాదు ఈ ఇద్దరి మధ్య ‘అరేయ్​’ అని పిలుచుకునేంత చనువు కూడా ఉంది.  తన ప్రాణస్నేహితుడి మరణంపై ఎమోషనల్ అయిన ఇళయరాజా..  తన ప్రాణ స్నేహితుడికి వీడ్కోలుగా ఒక పాటను కంపోజ్ చేశాడు. ‘మౌన అంజలి’ తమిళ్​ సాంగ్‌‌ను స్వయంగా రాసి..  కంపోజ్​ చేసి మరీ పాడాడు.  4‌‌‌‌0 వేలకు పైగా పాటలతో కొన్ని కోట్ల మందిని అలరించిన బాలుకి.. చిరకాల మిత్రుడు ఇళయరాజా తన పాటతో ఘనంగా నివాళి అర్పించాడు.

 

‘ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా!’ అంటూ అల్లు రామలింగయ్య వంకరలు తిరిగినా.. ‘చూడు పిన్నమ్మా.. పాడు పిల్లాడు’ అంటూ ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో హిజ్రా గెటప్​లో మాడా చిందులేసినా.. ‘నిన్నెక్కడో చూశానే.. నిన్నెక్కడో కలిశానే’ అని సుత్తివేలు ‘అప్పుల అప్పారావు’ క్లైమాక్స్‌‌లో ఎంత గింజుకున్నా … అదంతా బాలు తన గాత్రంతో చేసిన మ్యాజికే అని చెప్పాలి.  హీరోలకే కాకుండా క్యారెక్టర్​ ఆర్టిస్టులకు,  రాజబాబు నుంచి బాబుమోహన్​ దాకా కమెడియన్లందరికీ పాడి​ మెప్పించారాయన.  పాటలే కాదు..మధ్య మధ్యలో మిమిక్రీతో విచిత్రమైన సౌండ్లు చేస్తూ ఆ కామెడీ డోస్​ను మరింత పెంచేవాడు.

లెక్కలేనన్ని డబుల్ డోస్

చెన్నైలో ఉన్నప్పుడు సినిమా వాల్​పోస్టర్లు చూసే సగం తమిళ్ నేర్చుకున్నానని ఆమధ్య ఎస్పీబీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. సినిమాలో మూడ్​ బట్టి మాడ్యులేషన్​తో పాటలు పాడే బాలు.. మందు బ్యాక్​డ్రాప్ సాంగ్స్​ పాడే స్టైల్ మాత్రం గ‘మ్మత్తు’గా ఉంటుంది.  తమ మధుర గాత్రంతో వినేవాళ్లకి మత్తెక్కించేవారాయన. ఆ సంగతి పక్కన పెడితే.. మల్టీస్టారర్​ సినిమాల్లోనూ ఆయన ఇద్దరేసి హీరోలకు వాయిస్​ ఇచ్చిన పాటలు చాలానే ఉన్నాయి.  మెకానిక్ అల్లుడులో ‘గురువా గురువా’ అంటూ సాగే సాంగ్‌‌కి ఏఎన్నార్​.. చిరుకి,  ‘ప్రేమ’లో ‘ఐ యామ్ సారీ’ అంటూ తనకి, వెంకీకి, ‘ఇద్దరూ ఇద్దరే’లో ‘ఓనమాలు నేర్పాలని’ సాంగ్​లో నాగ్, ఏఎన్నార్​కి డబుల్ వాయిస్​ ఇచ్చింది ఒక్కరే కావడం.. ఆ ఒక్కరూ ఎస్పీబీ కావడం విశేషం. ఇలాంటి డబుల్ డోస్​ సాంగ్స్​ ఆయన ఖాతాలో వేలలోనే ఉన్నాయి.

వారెవ్వా!​

సింగీతం శ్రీనివాసరావు​ డైరెక్షన్​లో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన సినిమా ‘మేడమ్​’. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్​ లేడీ గెటప్​లో సాగే ‘మహిళా ఇక నిదుర నుంచి మేలుకో’ పాటను ఫిమేల్ వాయిస్​తో పాడింది బాలసుబ్రహ్మణ్యం గారే. మాధవపెద్ది సురేష్​ ఈ పాటను కంపోజ్ చేశాక.. మాధవపెద్ది సత్యంగారికి వినిపిస్తే ‘పిల్ల బాగా పాడింది రా’అన్ని మెచ్చుకున్నారట. చాలా గ్యాప్ తర్వాత ఓ ప్రముఖ టీవీ షోలో ఈ పాటను మళ్లీ వినిపించి ఆడియెన్స్​ను మెస్మరైజ్ చేశారు ఎస్పీబీ.