ఉత్తరప్రదేశ్ తీరు వేరే!

దక్షిణాది రాష్ట్రాలకు దేశంలోనే అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ కు కొన్ని పోలికలు కనిపిస్తాయి. సౌత్ స్టేట్స్ లో  ప్రాంతీయ పార్టీల హవా ఉంటే యూపీలోనూ ఈసారి లోకల్ పార్టీల కూటమి హవాయే కొనసాగింది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లోని  లోకల్ పార్టీలకు ఆయా రాష్ట్ర ప్రయోజనాలు ప్రయారిటీగా మారితే ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీల కూటమికి  కులాల లెక్కలే  కీలకంగా మారాయి.

అత్యధికంగా 80 లోక్‌‌సభ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్‌‌లో ఒకప్పుడు కాంగ్రెస్ హవా ఉండేది. 1980 వరకు కాంగ్రెస్‌‌కి యూపీ పెట్టని కోటలా ఉండేది. 1980 నుంచి కాంగ్రెస్ పట్టు కోల్పోయింది.  బలమైన ప్రాంతీయ పార్టీలు తెర మీదకు రావడంతో కాంగ్రెస్ దాదాపుగా రాజకీయంగా తెరమరుగైంది. 2014 లోక్‌‌సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ ఘోర ఓటమి పాలయింది. 66 సెగ్మెంట్లకు పోటీ చేసి కేవలం రెండు సీట్లు అమేథీ, రాయ్ బరేలినే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 71 సీట్లు గెలిచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈసారి యూపీలో రాజకీయ పరిస్థితులు మారాయి. బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీల కూటమిగా పోరు నడిచింది. బీసీ ఓట్ల పై బోలెడన్న ఆశలు పెట్టుకున్న సమాజ్ వాది పార్టీ, దళితులకు అండగా నిలిచే బహుజన్ సమాజ్ పార్టీ, జాట్ కులస్తుల్లో పలుకుబడి ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్ ఓ కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీకి సవాల్ విసిరాయి. కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ మూడో స్థానానికే ఆ పార్టీ పరిమితమయ్యేలా ఉంది.  2014లో నరేంద్ర మోడీ మేనియా దేశాన్ని ఊపేసింది. ఉత్తరప్రదేశ్ కూడా మోడీ ప్రభంజనం నుంచి తప్పించుకోలేకపోయింది.  ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారాయి. మోడీ మేజిక్ లేదంటున్నారు రాజకీయ పండితులు. అనేక రంగాల్లో మోడీ ప్రభుత్వం ఆశించినంతగా విజయాలు సాధించలేదని, ఈ పరిస్థితి తమకు తప్పకుండా అనుకూలంగా మారుతుందని   అఖిలేశ్ యాదవ్ ధీమాతో ఉన్నారు.

కూటమిని ఎదుర్కొనే కులాలకే టికెట్లు

తొలి రోజుల్లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని కూటమిని లైట్‌‌గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ ఆ తర్వాత మైండ్ సెట్ మార్చుకుంది. కూటమిని తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యింది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ ఎల్డీ ఏ కులాలను టార్గెట్ చేసుకుంటున్నాయో జాగ్రత్తగా గమనించి అదే ఫార్ములా అనుసరించింది.