స్పీకర్​కు నిరసన సెగ.. కామారెడ్డి జిల్లా హెగ్డోలిలో అడ్డుకున్న యువకులు

కోటగిరి, వెలుగు : ఎన్నికల ప్రచారంలో స్పీకర్  పోచారం శ్రీనివాస్​రెడ్డికి నిరసన సెగ తగిలింది. కామారెడ్డి జిల్లా పోతంగల్  మండలం హెగ్డోలిలో పోచారం శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రచార రథంలో వెళుతుండగా కొంతమంది స్థానికులు ఆయన రథాన్ని అడ్డుకున్నారు. తమకు కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని, రైతు రుణమాఫీ పూర్తిగా ఎందుకు చేయలేదని నిలదీశారు.

దళిత బంధు, బీసీ బంధు కొన్ని కులాలకేనా అని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. బీఆర్‌‌ఎస్ లీడర్లు ఆ ప్లకార్డులు చించేయడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అదే సమయంలో ఓ మహిళ.. స్పీకర్ ప్రచార రథాన్ని అడ్డుకుంది. దీంతో ఆమెను బీఆర్‌‌ఎస్  లీడర్లు సముదాయించారు. ఈ విషయమై స్పీకర్ మాట్లాడుతూ.. తాను చేసిన అభివృద్ధిని గుర్తించాలని కోరారు. పక్క నియోజకవర్గాలతో పోలిస్తే బాన్సువాడ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలన్నారు.