హైదరాబాద్: స్పీకర్ తీరును నిరసిస్తూ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యుల హక్కులకు భంగం కలిగించేలా స్పీకర్ వ్యవహరించారని పేర్కొన్నారు. సెషన్ తొలిరోజే తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని ఆరోపించారు.
తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్పీకర్‌ను అని, ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినా.. ఇంకా అధికారంలోనే ఉన్నామనే భావనలోనే కేటీఆర్ ఉన్నారని విమర్శించారు.
తాను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెప్పారు. అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం కోల్పోతోందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఇవాళ్టి శిక్షణా తరగతులకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సందేహాలను లేవనెత్తారు.
ఉత్తమ శాసన సభ వక్త అవార్డు ఇస్తం: స్పీకర్
చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుందని, గతంలో శాసన సభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే వారని స్పీకర్ గడ్డం ప్రసాద్ గుర్తు చేశారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు సభలో బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ శాసన సభ వక్త అవార్డు పరిశీలన చేస్తామని స్పీకర్ చెప్పారు.
సభలో 57 మంది కొత్త ఎమ్మెల్యేలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
‘ఈ సారి శాసన సభలో 57 మంది మొదటి సారి ఎన్నికైన ఎమ్మెల్యేలున్నారు. శాసన సభ అందరికీ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌దో వేరే ఇంకా ఎవరిదో కాదు. ఈ ట్రైనింగ్ సెషన్‌కు అందరినీ పిలిచాం. పాత రోజుల్లో సిద్ధాంత పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా.. సభలో ఎవరి పాత్ర వారు పోషించారు. ఎమ్మెల్యేలు అందరూ శాసన సభకు హాజరయ్యే సంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభకు రాకుండా దూరంగా ఉండకండి.’
ప్రజలకు దూరమైతుండ్రు: మండలి చైర్మన్ గుత్తా
గాలివాటం రాజకీయాలు ప్రారంభమైనప్పటి నుంచి కొత్తవాళ్లు మళ్లీ గెలవడం లేదని, మొదటి సారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వాళ్లు 25 శాతమేనని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కోటరీ వల్ల ప్రజలు స్వయంగా కలుసుకోలేక పోతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు ఫోన్ దగ్గర పెట్టుకోవాలని, ఎవరైనా కాల్ చేస్తే డైరెక్టుగా మాట్లాడాలని సూచించారు. తాను ఓ సారి ఓడిపోవడానికి కారణం సెక్యూరిటీ సమస్యేనని చెప్పారు. ప్రజలు ఎమ్మెల్యేలకు దూరం కావడానికి కారణం పీఏలు, పీఆర్వోలేనని అన్నారు.