పదేళ్లలో తెలంగాణను నాశనం చేసిండు: స్పీకర్ గడ్డం ప్రసాద్

 పదేళ్లలో తెలంగాణను నాశనం చేసిండు: స్పీకర్ గడ్డం ప్రసాద్

వికారాబాద్: పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను నాశనం చేశాడని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విమర్శించారు. తాగుబోతు, తిరుగుబోతు తండ్రి ఉంటే సంసారం ఎలా దెబ్బతింటుందో.. అచ్చం అలాగే గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం కూడా ఖరాబు అయిందని.. మొత్తం నాశనం చేశారని మండిపడ్డారు. పదేళ్లలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని.. ఇప్పుడు వాటికి నెలకు ఏడు వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పాత అప్పులు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నామని.. లేకపోతే ఇప్పటికే అన్ని హామీలను అమలు చేసేవాళ్లని అన్నారు. వికారాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ యస్ రాజేష్ రెడ్డి 2024, అక్టోబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ALSO READ | మూసీ టెండర్ అగ్రిమెంట్ రూ.141 కోట్లు మాత్రమే: సీఎం రేవంత్ రెడ్డి

 ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో ఏర్పాటు చేయనున్న నేవీ రాడార్ స్టేషన్‎కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పర్మిషన్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. 2017లో  జీవో నెం.44  ద్వారా పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ సర్కార్ అనుమతులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడేమో దామగుండం నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి వ్యతిరేకంగా అదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ప్రభుత్వ హయాంలో పర్మిషన్లు ఇచ్చి.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.