హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ విలువలు, గైడ్ లైన్స్ కు అనుగుణంగా తెలంగాణ శాసనసభ పనిచేస్తున్నదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో, వాటిని చట్టాలుగా ఆమోదించడంలో తెలంగాణ అసెంబ్లీ రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. బిహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీవోసీ)లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
రాజ్యాంగం ఆవిర్భావం జరిగి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువల బలోపేతానికి పార్లమెంట్, శాసనసభల తోడ్పాటు అంశంపై స్పీకర్ ప్రసగించారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్ రూపొందించిన చట్టాలు దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడుతున్నాయని స్పీకర్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న రైతుల ప్రయోజనం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తుందని, రైతు భరోసా పెంపు, రైతు బీమా అమలు ద్వారా రైతాంగానికి అండగా ఉన్నదన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి ఇటీవల సీఎం.. మెస్, డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు స్పీకర్ తెలిపారు. మహిళలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.