చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందాలి : స్పీకర్  ఓం బిర్లా

చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందాలి : స్పీకర్  ఓం బిర్లా
  • అందుకోసం టెక్నాలజీని వాడుకోవాలి: స్పీకర్  ఓం బిర్లా
  • 10 వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్న తెలంగాణ స్పీకర్  గడ్డం ప్రసాద్

న్యూఢిల్లీ, వెలుగు: చివరి లబ్ధిదారుడి వరకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. చట్టసభల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడానికీ టెక్నాలజీని ఉపయోగించడంపై ఫోకస్  పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం పార్లమెంటు ఆవరణలో 10వ కామన్వెల్త్  పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ సర్వసభ్య సమావేశం జరిగింది.

రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు స్పీకర్  ఓం బిర్లా అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు 46 మంది ప్రీసైడింగ్  ఆఫీసర్లు, నలుగురు చైర్మన్లు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది అసెంబ్లీ స్పీకర్లు, ముగ్గురు డిప్యూటీ చైర్మన్లు, 14 మంది డిప్యూటీ స్పీకర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున స్పీకర్  గడ్డం ప్రసాద్ రావు, ఏపీ నుంచి కౌన్సిల్  చైర్మన్  మోహన్ రాజు ఈ సదస్సుకు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా స్పీకర్  ఓం బిర్లా మాట్లాడుతూ... పార్లమెంటు ఆమోదించిన చారిత్రాత్మక చట్టాలు దేశంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేశాయన్నారు. శాసన సంస్థల సహకారం, మద్దతు లేకుండా స్వావలంబన – అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించడం సాధ్యం కాదన్నారు.

గత ఏడు దశాబ్దాల ప్రయాణంలో దేశ చట్టసభలు ప్రజల అంచనాల, ఆకాంక్షలను నెరవేర్చడంలో ఎంతమేరకు విజయం సాధించాయో ఆలోచించుకోవాలని ప్రిసైడింగ్ అధికారులు, శాసనసభ్యులను ఆయన కోరారు. ఆత్మపరిశీలన లేకుండా సమ్మిళిత అభివృద్ధి కల సాకారం కాదన్నారు.