- లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ
- సందర్భంగా స్పీకర్, టీఎంసీ ఎంపీ మధ్య మాటల యుద్ధం
న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్ 2024–25 పై చర్చ సందర్భంగా స్పీకర్ఓం బిర్లా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ మధ్య మాటల యుద్ధం నడిచింది. అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ రైతులు, రైతు సంస్థలు, ప్రతిపక్ష పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కేంద్రం గతంలో 3 వ్యవసాయ బిల్లులను ఆమోదించిందని అన్నారు.
దీంతో స్పీకర్ జోక్యం చేసుకొని.. “రికార్డులను పరిశీలిద్దాం..ఆ అంశంపై 5.30 గంటలు సభలో చర్చ జరిగింది” అని అన్నారు. దీనికి అభిషేక్ బెనర్జీ సమాధానమిస్తూ.. ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఆ వెంటనే స్పీకర్ కలుగజేసుకొని.. ‘ స్పీకర్ఏదైనా మాట్లాడితే.. అది నిజమే ఉంటుంది’ అని అన్నారు. స్పీకర్‌ను అనుసరిస్తూ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. “నేను మాట్లాడినప్పుడు.. తప్పులు మాట్లాడను’ అని వ్యాఖ్యానించారు.
సభలో హుందాగా వ్యవహరించాలి: స్పీకర్
అభిషేక్ బెనర్జీ బడ్జెట్‌పై మాట్లాడుతూ.. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తగిన మెజార్టీ రాలేదు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ మద్దతుతో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అందుకే వారు డిమాండ్ చేసినట్టు ఈ బడ్జెట్లో ఏపీ, బిహార్‌కు ఎక్కువ కేటాయించారు. మిగతా రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదు” అని అన్నారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. సభలో లేనివారి పేర్లు ప్రస్తావించొద్దన్నారు.
టీఎంసీ సభ్యులు సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. బెనర్జీ స్పందిస్తూ.. “మరి మమతా బెనర్జీ సభలో ఉన్నారా? ఆమె పేరును ఎన్డీయే ఎంపీలు ఎందుకు ప్రస్తావించారు?” అని ప్రశ్నించారు. “మీ కుర్చీ గౌరవాన్ని కాపాడుకోండి.. ఆమెకు క్షమాపణ చెప్పండి.. అప్పుడు నేను మాట్లాడడం కొనసాగిస్తాను” అని అన్నారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. మమతా పేరును రికార్డుల్లో నుంచి తొలగిస్తున్నట్టు చెప్పారు. ‘మీరు నాకు ఆదేశాలివ్వొద్దు.. మీరు మాట్లాడండి” అని బెనర్జీని స్పీకర్ ఆదేశించారు. సభాపతి కుర్చీపై సభ్యులెవరూ వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.