చిలకలగూడ దూద్ బావిలో పేలుడు ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పరామర్శించారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితులను మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించనున్నట్లు ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మొత్తం 8మంది గాయపడగా.. వారిలో నారాయణ స్వామి అనే వ్యక్తి చనిపోయాడు.
ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్న ఖలీమా బేగం, జాఫర్, నర్సింగరావు, శ్రీనివాస్, ఉర్మిళకు తీవ్రగాయాలు కావడంతో వారిని యశోద హాస్పిటల్కు తరలిస్తున్నట్లు పద్మారావు గౌండ్ చెప్పారు. వారి వైద్యానికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన నారాయణ స్వామి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
మరోవైపు చిలకలగూడలో ప్రమాదం జరిగిన స్థలాన్ని హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.