కాంగ్రెస్​ పార్టీ రైతులకు వ్యతిరేకం : స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి

రైతుబంధు బంద్​ చేయాలని ఫిర్యాదు చేసిండ్రు
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మ తిరిగే తీర్పునివ్వాలి

 

కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ  రైతులకు వ్యతిరేకమని, రైతులు అభివృద్ధి చెందితే వారికి గిట్టదని స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి విమర్శించారు. రైతు బంధును ఆపాలని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్​కు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. గురువారం కామారెడ్డి లో విప్​ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్​ఎంకే ముజీబోద్దీన్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అయిదేండ్లుగా రైతుబంధు పథకం అమలవుతుందని ఇప్పటి వరకు పది విడుతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.

కానీ కాంగ్రెస్​ నేతలు  రైతుబంధు ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్​ పార్టీ రైతులకు ఏం చేయకపోగా, మంచి చేసే వాళ్లను అడ్డుకుంటున్నారన్నారు. కర్నాటకలో ఆ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అక్కడి రైతులే మన రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. మోసం చేసి ఓట్లు దండుకోవడం వారికి అలవాటేనన్నారు. కాంగ్రెస్ ​పార్టీ వైఖరి చూస్తే మిషన్ ​భగీరథ నీళ్ల సప్లయ్​ కూడా నిలిపి వేయాలని కోరేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలు, రైతులు కాంగ్రెస్​కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా చోట్ల క్యాండిడేట్లు కూడా దొరకడం లేదని, బీజేపీ10 మించి సీట్లు గెలిచే పరిస్థితి లేదన్నారు. మరో నెల రోజుల్లో పోలింగ్ ఉన్నా టికెట్లు కూడా పంపిణీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్​ఉందన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దిమ్మ తిరిగే ఫలితాలు వస్తాయన్నారు.ఇక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నందున ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.