తెలంగాణ ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదు : పోచారం శ్రీనివాస్​రెడ్డి

  •     కేసీఆర్ కృషితోనే ఉచిత కరెంట్, సాగునీరు అందుతున్నాయ్​
  •     స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి

కోటగిరి,వెలుగు :  తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి విమర్శించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపుతోనే పదేండ్లలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా స్పీకర్ పోచారం మండలంలోని గన్నారం, లింగాపూర్, బస్వాపూర్, అడ్కాస్ పల్లి తదితర గ్రామాల్లో  పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, రైతు భీమా లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పే మాయమాటలు విని ప్రజలు మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్​కు ఓటేసి, బాన్సువాడ ఎమ్మెల్యేగా తనను మరోసారి గెలిపించాలని కోరారు. స్పీకర్ ఎన్నికల ఖర్చుల కోసం లింగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ రూ.10 వేలు అందించారు.