వికారాబాద్, వెలుగు: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ చికిత్స చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సమయపాలన పాటించకుంటే ఉపేక్షించనని హెచ్చరించారు. ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని సూచించారు. మర్పల్లి మండలం పట్లూర్ లోని పీహెచ్ సీని సోమవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డాక్టర్ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ ప్రతీక్ జైన్ తో ఫోన్ లో మాట్లాడారు. డ్యూటీ డాక్టర్ 3 గంటలకే వెళ్లి పోయిందని, రోగులకు సరిపడా మందులు లేవని, అపరిశుభ్రత ఉందని.. వచ్చి తనిఖీ చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ సమాధానమిచ్చారు.