
ముషీరాబాద్, వెలుగు: శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని పలువురు వక్తలు అన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిగిన ఏప్రిల్ 6ను గుర్తు చేసుకుంటూ ఆదివారం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన కొడుకు సూర్యం అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటపై తూటా సభ నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రముఖ రచయిత్రి మీనా కందస్వామి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, విమలక్క, అల్లం నారాయణ, జిలకర శ్రీనివాస్, శంకర్, వివిధ సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు.
పాటకు, గద్దర్ అన్నకు ఎన్నటికీ మరణం ఉండదన్నారు. తెలంగాణ సమాజంలో 50 ఏండ్లకు పైగా భావ ప్రకటన స్వేచ్ఛ లేక ప్రశ్నించే గొంతుకలు పాలకుల అణచివేతకు గురవుతున్నాయన్నారు. ఆనాడు జరిగిన పరిణామాలు మళ్లీ జరుగుతుండడం బాధాకరమన్నారు. ప్రశ్నించే కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలను అర్బన్ నక్సలైట్లుగా కేంద్ర ప్రభుత్వం ముద్ర వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాదిలో 145 మంది ఆదివాసీలను మావోయిస్టులుగా ముద్ర వేసి హత్య చేశారని ఆరోపించారు. 2026 సంవత్సరం వరకు నక్సలిజం నిర్మూలిస్తామని అమిత్ షా ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేపట్టి, హింస లేని సమాజం కోసం పాటు పడాలన్నారు. కార్యక్రమంలో వేములపాటి అజయ్ కుమార్, ఆశ శ్రీరాములు సాంబమూర్తి ఆర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.