దామగుండం రాడార్ ​ప్రాజెక్టును ఒప్పుకోం .. వక్తలు డిమాండ్

దామగుండం రాడార్ ​ప్రాజెక్టును ఒప్పుకోం .. వక్తలు డిమాండ్
  • 12 లక్షల చెట్లను నరికేయాల్సి వస్తుంది
  • 60 వేల మందిపై రేడియేషన్ప్రభావం పడుతుంది
  • రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆందోళన 

ఖైరతాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని దామగుండం వద్ద నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని వక్తలు డిమాండ్ చేశారు. అటవీ భూములను నేవీకి కేటాయించి, రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికులతో కలిసి వారు నిరసన తెలిపారు. ‘సేవ్​దామగుండం ఫారెస్ట్’ పేరుతో సోమవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, పర్యావరణవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్​లో చోటేలాల్ భిలాలా అనే గిరిజనుడు రెండు భారీ వృక్షాలను నరికితే అక్కడి ఫారెస్టు అధికారులు రూ.1.20 కోట్ల ఫైన్ వేయడంతోపాటు కేసు పెట్టారని గుర్తుచేశారు. చెట్లు ఆక్సిజన్ ఇవ్వడంతోపాటు భూసారాన్ని కాపాడతాయన్నారు. దామగుండంలో రాడార్​ స్టేషన్ ​నిర్మాణం కోసం 2,900 ఎకరాల అటవీభూమి ధ్వంసం అవుతుందని, 12 లక్షల చెట్ల ను నరికివేయాల్సి వస్తుందన్నారు. దీనికి పరిహారంగా ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందని ప్రశ్నించారు. 

నేవీ రాడార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010 నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయని, ఈ ప్రాజెక్టును ఎంతమాత్రం ఒప్పుకోమన్నారు.  రూ.2,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు. తెలంగాణ విఠల్​ మాట్లాడు తూ.. ఈ ప్రాజెక్టును 11 రాష్ట్రాలు  తిరస్కరించాయన్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటైతే 20 గ్రామాల్లో నివసిస్తున్న 60 వేల మందిపై రేడియేషన్ ప్రభావం ఉంటుందన్నారు. సమావేశంలో పీవోడబ్ల్యూ సంధ్య, సజయ, పృథ్వీరాజ్ యాదవ్, రుచిత, బక్క జడ్సన్ తదితరులు మాట్లాడారు.