డీల్స్ కుదుర్చుకుంటున్న అభ్యర్థులు
న్యూట్రల్ ఓటర్లే టార్గెట్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. సభలు, సమావేశాల్లో లీడర్లు మాటల తూటాలు పేలుస్తున్నరు. ఎదుటి పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్నరు. కానీ ఇంతకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం దుమ్ము రేపుతోంది. అన్ని పార్టీలూ సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నయి. ఎలాంటి విషయమైనా క్షణాల్లో జనానికి చేరే చాన్స్ ఉండటంతో దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినయి. తమ పార్టీ హామీలను వివరిస్తూనే ఎదుటి పార్టీలపై విమర్శలకు దిగుతున్నయి. వ్యంగ్యాస్త్రాలు, చలోక్తులు, ఫన్నీ వీడియోలు, స్పూఫ్‌లు, గ్రాఫిక్స్ ఫొటోలు ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నయి. ఇందులో కొన్ని నవ్వు తెప్పిస్తున్నయి. మరికొన్ని ప్రత్యర్థి పార్టీలకు కోపం తెస్తున్నయి. చాలా సందర్భాల్లో పార్టీల సపోర్టర్లు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిట్టుకుంటున్నరు.
సోషల్ మీడియాదే హవా
గతంలో ఎన్నికలప్పుడు గోడల మీద రాతలు, పోస్టర్లు ప్రత్యక్షమయ్యేవి. కరపత్రాల పంపిణీ కన్పించేది. తర్వాతి కాలంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, ఎన్నికల వాగ్దానాలతో కూడిన బ్రోచర్లవంటివి వాడేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా హవా నడుస్తోంది. క్షణాల్లో వేలాది మందికి గ్రూపుల ద్వారా పోస్టులు చేరుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా టీమ్ లను పెట్టుకుంటున్నారు.
పోస్టులతో చుక్కలు చూపిస్తరు
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో రాజకీయ పార్టీలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి చిన్న పొరపాటు, వ్యతిరేక అంశం దొరికిందంటే చాలు చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలకు వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు. వేల సంఖ్యల్లో కామెంట్ల మీద కామెంట్ల పెట్టి రన్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, షేర్ చాట్, వాట్సాప్ గ్రూపులు తదితర వాటిల్లో జోరుగా ఫార్వర్డ్ చేస్తున్నారు.
అన్ని పార్టీలకూ ‘సోషల్’ వింగ్స్
పార్టీలన్నీ ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. పార్టీ కార్యకలాపాలు, ప్రచార వివరాలు, యాడ్స్ ఇలా అన్నింటినీ ఈ వింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పార్టీకి మైలేజీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు నేతలు తమ సోషల్ మీడియా ఖాతాలను సొంతంగానే ఆపరేట్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్, ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్, బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ రేవంత్ రెడ్డి వంటి నేతలంతా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోలేక కొందరు, టైం లేక మరికొందరు నేతలు కన్సల్టెంట్ల సహాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ అభ్యర్థులు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ప్యాకేజీలు మాట్లాడుకుని వారికి డబ్బులు ఇస్తారు. దీంతో యువతకు ఉపాధి కూడా దొరుకుతోంది.
ఫేక్ అకౌంట్లూ బొచ్చెడు
కొందరు ఇటీవల సోషల్ మీడియా ఏజెన్సీలను ప్రారంభించారు. ఈ ఏజెన్సీలు పార్టీలు, నేతలతో డీల్ కుదుర్చుకుంటున్నాయి. స్టూడెంట్లు, యూత్‌కు నెలవారీ జీతాలు ఇచ్చి వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఫేక్ అకౌంట్లు ప్రారంభిస్తున్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ ఫేక్ అకౌంట్ల నుంచి పోస్టులు, కామెంట్లు పెడుతుంటారు. సెలబ్రెటీలు, మోడళ్లు, సినిమా స్టార్ల పేర్లతో సైతం ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఫేక్ అకౌంట్ల పోస్టింగ్‌లపై కొందరు నేతలు కేసులు కూడా పెట్టారు. సోషల్ మీడియాలో పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. ఇష్టారీతిన ప్రచారం, దుష్ప్రచారం వ్యాప్తి చేసేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ఫేక్ అకౌంట్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని నెటిజన్లు అంటున్నారు.
కొన్ని వర్గా లపైనే దృష్టి
అన్ని పార్టీల వాళ్లూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు . అయితే ఇది అందరినీ ప్రభావితం చేస్తుందని చెప్పలేం. అందుకే సోషల్ మీడియా వింగ్ లు ప్రత్యేకంగా కొన్ని వర్గాలనే టార్గెట్‌గా ఎంచుకుంటున్నాయి. ప్రతిచోటా కొంతమంది న్యూట్రల్ ఓటర్లు ఉంటారు. వీరిని తమ వైపు మళ్లిస్తే విజయం సాధించినట్లే అని
రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో న్యూట్రల్ ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు, అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
For more News….
V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు