బొగ్గు బ్లాకుల వేలాన్ని రాజకీయం చేయొద్దు

బొగ్గు బ్లాకుల వేలాన్ని రాజకీయం చేయొద్దు

మన దేశానికి ఏటా దాదాపు 1,100 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. కోల్​ఇండియా 760 మిలియన్ టన్నులు,  సింగరేణి 60 మిలియన్ టన్నులు, ఇతర ప్రైవేట్ సంస్థలు చేస్తున్న ఉత్పత్తి కలిపినా కూడా 850 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. సుమారు 250 మిలియన్ టన్నుల కొరత ఉండటంతో విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. అందుకుగానూ ఏటా రూ.2 లక్షల కోట్లను విదేశీ సంస్థలకు చెల్లిస్తున్నాం. మన దేశంలో సహజ వనరులు ఉండి కూడా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడం దేశానికి ఆర్థికంగా నష్టం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. యూపీ‌‌‌‌ఏ హయాంలో 216 బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కేటాయించారు. అయితే ఎలాంటి బిడ్స్ లేకుండా, పారదర్శకత పాటించకుండా, దొడ్డిదారిన ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా బొగ్గు బ్లాకులు అప్పజెప్పారని, ఇందులో రూ.1.86 లక్షల కోట్ల స్కామ్​ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిని అతి పెద్ద  కుంభకోణంగా కంప్ట్రోలర్​ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కూడా పేర్కొంది. ఈ కోల్​ స్కామ్​కు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కూడా పడింది. విచారణ తర్వాత యూపీఏ హయాంలో కేటాయించిన 216 బొగ్గు బ్లాకులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఎన్‌‌‌‌డీ‌‌‌‌ఏ సర్కారు ఏం చేసిందంటే..
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్​మెంట్, రెగ్యులేషన్(ఎంఎండీఆర్) అమెండ్మెంట్ యాక్ట్, 2015 బిల్లును ఎన్​డీఏ ప్రభుత్వం పార్లమెంట్​లో ప్రవేశపెట్టింది. ఈ చట్ట సవరణ ద్వారా బొగ్గు గనులను ప్రభుత్వ, ప్రైవేట్  సంస్థలు 1. క్యాప్టివ్ మైన్స్, 2. రిజర్వేషన్స్, 3. వేలం అనే మూడు పారదర్శక విధాలుగా పొందవచ్చు. ఈ బిల్లుపై పార్లమెంట్​లో చర్చ సందర్భంగా ఆనాడు టీ‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ ఎం‌‌‌‌పీలు మద్దతు తెలిపారు. ఇలా మద్దతు తెలిపిన ఎంపీల్లో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. అంటే సింగరేణి కూడా వేలం ద్వారానే బొగ్గు బ్లాకులు పొందాలని అప్పుడే తెలుసు. కానీ, ఈ రోజు ఆ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందనడం ద్వంద్వ వైఖరి కాదా? ఇది కార్మికులను మోసం చేయడం కాదా?

సీఎం కేసీ‌‌‌‌ఆర్.. ప్రధాని మోడీని అనేకసార్లు కలిశారు. ఎప్పుడైనా సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు గురించి గానీ, సింగరేణి కార్మికుల సమస్యల గురించి గానీ మాట్లాడారా? సింగరేణి కార్మికుల కష్టార్జితంతో వచ్చిన డబ్బులను ఏటా తెలంగాణ ప్రభుత్వం రూ.7 వేల కోట్ల వరకు రాయల్టీ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ ల కోసం అనేక పేర్లతో తీసుకుంటోంది. తెలంగాణ గుండెకాయ అయిన సింగరేణి నుంచి రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు, రాష్ట్రానికి విద్యుత్ సరఫరా, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు ఏటా అభివృద్ది పేరుతో కోట్ల రూపాయల నిధులు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మనుగడ కోసం చిత్తశుద్ధితో ఏం చేసిందో చెప్పగలదా?

సింగరేణి యాజమాన్యం వైఫల్యం
ఎంఎండీఆర్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కోల్ ఇండియా యాజమాన్యం, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శితో సంప్రదించి బొగ్గు గనుల రిజర్వేషన్స్ విధానంలో బొగ్గు గనులు పొందారు. కోల్ ఇండియా 116 బొగ్గు గనులను రిజర్వేషన్  ద్వారా సాధించుకున్నది. సింగరేణి యాజమాన్యం కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ కార్మిక సంఘాల ద్వారా సంప్రదింపులు చేసి ఉంటే 2019 నాటికి బొగ్గు గనులను సాధించి ఉండేది. సింగరేణి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంస్థ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రాజకీయంగా జోక్యం చేసుకుని, 49 శాతం వాటా కలిగిన కేంద్రాన్ని లెక్క చేయకుండా, వాటాదారుల ఒప్పందాలను తుంగలో తొక్కి, కార్మికుల దృష్టిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గొడవగా సృష్టించింది. అందుకే కార్మికులు బొగ్గు గనుల కేటాయింపు కోసం సమ్మె చేస్తే.. దానిని సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసిన సమ్మెగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర బొగ్గు గనుల మంత్రి చెప్పారు. అయినా యాజమాన్యం పద్ధతి మార్చుకోలేదు. 

ఇది ద్వంద్వ వైఖరి కాదా?
తెలంగాణలో 4 బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా.. ఒడిశాలోని బొగ్గు గనుల కేటాయింపు కోసం సింగరేణి వేలంలో ఎందుకు పాల్గొంటోంది. కేంద్రం ఇప్పటికే సింగరేణికి నైనీ, న్యూపాత్రపాద బొగ్గు గనులను ఒడిశాలో కేటాయించింది. యావత్ సింగరేణి గనుల్లో ఎన్ని బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో.. వాటిలో సగం ఈ రెండు గనుల్లోనే ఉన్నాయి. ఈ గనుల కేటాయింపులు.. అదే చట్టం కింద జరిగాయి. అప్పుడు ఈ చట్టం మీకు చుట్టం అయింది. 13వ విడత వేలంలో ఒడిశాలోని బొగ్గు గనుల కోసం సింగరేణి బిడ్స్ వేసింది. మరి వేలం ద్వారా బొగ్గు బ్లాకుల కేటాయింపులకు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఒడిశాలో ఏ విధంగా బొగ్గు బ్లాకుల కేటాయింపు కోరుతోంది. చట్టం ముందు అందరూ సమానమే కదా. ఈ ప్రశ్నలకు జవాబు కోరుతోంది కార్మిక వర్గం, తెలంగాణ సమాజం. రిపబ్లిక్ డే సందర్భంగా సింగరేణి సీఎండీ మాట్లాడుతూ.. వేలంలో పాల్గొని సింగరేణి గనులను పొందుతుందని, తద్వారా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి మాటలే చెప్పారు. అన్ని రాష్ట్రాలకూ పాలసీ ఒకేలా ఉంటుంది. కానీ ఇలా సంస్థను, కార్మికులను, సింగరేణి ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంత వరకు కరెక్ట్?
తాడిచెర్ల కేటాయింపులో పారదర్శకత ఏది?

ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తాడిచెర్ల గని నుంచి బొగ్గు వెలికితీత పనులు సింగరేణికి ఎందుకు ఇవ్వలేదు? తాడిచెర్ల గనిలో బొగ్గు వెలికితీత కాంట్రాక్టును చేపట్టబోమని లెటర్​ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిపై ఎందుకు ఒత్తిడి తెచ్చింది? దాని ఫలితంగా కేంద్రం తాడిచెర్ల బొగ్గు గనిని టీఎస్​ జెన్​కోకు కేటాయించింది. ఈ గనిలో ఏఎంఆర్ కంపెనీకి 25 ఏండ్ల కాంట్రాక్టు ఎందుకిచ్చారు? ఏఎంఆర్ ఎవరి బినామీ? డాట్ కంపెనీ ఎవరి బినామీ? తాడిచెర్ల 2లో బొగ్గు వెలికితీత కాంట్రాక్టును ఏఎంఆర్‌‌‌‌కు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చిన మాట నిజం కాదా? బీఎంఎస్ ఆందోళనతో అది ఆగిపోలేదా? తాడిచెర్ల బొగ్గు గనుల అన్వేషణలో 40 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడేమో 80 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెబుతున్నారు. బొగ్గు గనుల వేలం వెనుక అవినీతి రాజకీయాలు దాగి ఉన్నాయని సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలకు తెలుసు. రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు అవినీతి పార్టీలకు, అవినీతి సంఘాలకు, అవినీతి అధికారులకు తగిన గుణపాఠం చెబుతారు.
బొగ్గు గనుల వేలంపై రాష్ట్రంలో రాజకీయం నడుస్తోంది. ఇది సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దాని అనుబంధ కార్మిక సంఘం రాజకీయ స్వార్థంతో సింగరేణి కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తూ దుష్ప్రచారంతో కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారు. ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్​మెంట్, రెగ్యులేషన్(ఎంఎండీఆర్) అమెండ్మెంట్ యాక్ట్, 2015 ప్రకారమే ప్రస్తుతం దేశంలో బొగ్గు గనుల కేటాయింపు జరుగుతోంది. ఈ చట్టానికి పార్లమెంట్​లో టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. కానీ, ఇప్పుడు అదే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ, కార్మికుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది. అటు సింగరేణి యాజమాన్యం కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఒడిశాలోని బొగ్గు వేలంలో పాల్గొన్న సింగరేణి.. రాష్ట్రంలోని వేలంలో మాత్రం పాల్గొనలేదు.

సంస్థను, కార్మికులను బలిపశువులను చేయొద్దు
సమ్మె పేరుతో రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘం ప్రధాని దిష్ఠిబొమ్మలు దహనం చేస్తుంటే సింగరేణి యాజమాన్యం చోద్యం చూస్తోంది. ఈ పరిణామాలు సింగరేణికి  బొగ్గు గనుల కేటాయింపును జటిలం చేస్తాయి. అందువల్ల సింగరేణి యాజమాన్యం రాజకీయాలకు అతీతంగా సంస్థ అభివృద్ధి, కార్మికుల శ్రేయస్సు కోసం జాతీయ కార్మిక సంఘాలను కలుపుకుని ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని, అవసరమైతే ప్రధానిని కలిస్తే ప్రయోజనం ఉంటుంది. జాతీయ సంఘాల నాయకులు సమ్మె నోటీస్ పై జరిపిన చర్చల సందర్భంగా సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఈ దిశలో ప్రయత్నం చేయాలని కార్మికులు కోరుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం సింగరేణి కార్మికులను, సంస్థను బలిపశువును చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.