దేశంలో కార్పొరేటు సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతుల జాబితాలలో చోటు సంపాదిస్తుంటే దేశానికి అన్నం పెట్టే రైతులు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి ఎక్కుతున్నారు. నలుగురికీ అన్నం పెట్టే రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలు పోతాయని ఆనాడు రైతులంతా కూడా ఉద్యమాలలో పాల్గొన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చింది.
ప్రభుత్వం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన నివేదికలో రాష్ట్రం ఏర్పడిన ఈ ఏడేండ్ల కాలంలో 7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వెయ్యి మందికి పైగా రైతులు చనిపోవడం ఆందోళనకరం. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్‌లో యాసంగిలో రైతులు ఎవరూ కూడా వరి పంట సాగు చేయ వద్దు అని ప్రకటించారు. దీని ద్వారా రైతులు మరింత మానసిక వేదనకు గురయ్యారు. మెదక్ జిల్లాలో కరణం రవి అనే యువ రైతు తన లెటర్‌లో మా భూమిలో వరి తప్ప ఏ పంట పండదు అని తరతరాలుగా అదే పంట పై ఆధారపడి జీవిస్తున్నామని, మీరు వరి వద్దంటే మా జీవనం ముందుకు పోదు అని తెచ్చిన అప్పుల వడ్డీలు పెరిగిపోతున్నాయి అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో రైతులకు భరోసా ఇవ్వాల్సిన అటువంటి ప్రజా ప్రతినిధులు సముద్ర బీచ్‌లో డీజే పాటలు డాన్సులు వేసే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంది.
లోపభూయిష్ట ప్రభుత్వ విధానాలు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం వల్ల కేవలం పెద్దపెద్ద భూస్వాములకు మాత్రమే లాభం చేకూరుతోంది. చిన్న సన్నకారు రైతులకు ఏ మాత్రం కూడా లాభం చేకూరడం లేదు. రాష్ట్రంలో ఎక్కువమంది కౌలు రైతులు ఉన్నారు. ఈ పథకం కౌలు రైతులకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదు. చిన్న సన్నకారు రైతుల పెట్టుబడి సహాయాన్ని బ్యాంకు వాళ్ళే వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు. అది రైతులకు ఇవ్వడం లేదు. ఇది క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి నిజం. 2018 ఎన్నికల సమయంలో లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని అని ప్రకటించి ఇప్పటికి కూడా అది సాధ్యం కాలేదు. వానా కాలంలో ఇవ్వాల్సి నటువంటి క్రాప్ లోన్‌లు ఇవ్వలేదు. కేవలం 30 వేల వరకు రుణమాఫీ చేసి ప్రభుత్వం రుణమాఫీ చేశామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటోంది. వ్యవసాయంలో ఏటా పెట్టుబడులు పెరుగుతున్న ఆ మేరకు దిగుబడి రాక రైతులు క్రమంగా అప్పుల ఊబిలోకి నెట్టి వేయ బడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తేవడం చివరకు దిగుబడి తక్కువ రావడంతో అప్పులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, పండుగలు తదితర కారణాల వలన ఇంకా అప్పులు పెరిగిపోవడం, తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్రమైన మనోవేదనకు గురై కొంతమంది రైతులు అనారోగ్య పాలై, మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
పంట నష్ట సహాయం లేదు
ఇటీవల కాలంలో భారీ వర్షాలతో, వరదలతో పంటలు దెబ్బతినడం, కొట్టుకొని పోవడం ఇలాంటి కారణాల వలన రైతులు ఎక్కువగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయినటువంటి రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సీజన్లో ఇన్‌పుట్ సబ్సిడీ కింద పంట నష్ట పరిహారం అందజేస్తున్నాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం నుండి రైతులకు ఎలాంటి సబ్సిడీ కింద ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ పసల్ భీమా పథకంలో మన రాష్ట్ర ప్రభుత్వం చెర లేదు. దీంతో కనీసం బీమా కంపెనీల నుండి వచ్చే బీమా పరిహారం కూడా రైతులకు అందడం లేదు. ఫలితంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు భారీ వర్షాలు వరదలకు కళ్లముందే కొట్టుకుపోతుంటే రైతు దిక్కుతోచని పరిస్థితిలో మరణాలకు పాల్పడుతున్నారు.
ఆందోళనకరంగా ఆత్మహత్యలు
ఈ రెండు నెలల కాలంలో మన రాష్ట్రంలో 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరం. అప్పుల బాధలు ఒకవైపు, సెంటర్లో వడ్లు పోసి వారాలు గడుస్తున్నా సర్కారు కొనక పోవడం తడిసి మొలకలు రావటం, యాసంగిలో వరి సాగు వద్దనడం, ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయాలో తెలియకపోవడంతో పండించిన వరి కుప్ప పైనే కొంత మంది రైతుల గుండెలు ఆగి చనిపోతున్నారు.
ప్రభుత్వం ముందున్న సవాళ్లు
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు మానసిక ధైర్యాన్ని అందించాలి. పండించిన పంటలకు మద్దతు ధరను అందే విధంగా చర్యలు తీసుకోవాలి. సరైన సమయంలో రుణమాఫీ చేసి బడా భూస్వాములకు పెట్టుబడి సహాయాన్ని అందించకుండా చిన్న సన్నకారు కౌలు రైతులకు పెట్టుబడి సహాయం సరైన సమయంలో అందించాలి. ప్రత్యామ్నాయ పంటలను, వాణిజ్య పంటలను వేసే విధంగా రైతులను ప్రోత్సహించాలి. వారికి తగిన సబ్సిడీ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి. రైతు బీమా పథకంలో ఉన్న 58 సంవత్సరాల నిబంధనలకు సంబంధం లేకుండా ఆత్మహత్య చేసుకున్నటువంటి, మానసిక వేదనతో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులకు బీమా ప్రీమియం అందించే విధంగా చర్యలు చేపట్టాలి. లేదంటే రైతుల ఆత్మహత్యలు మరిన్ని చూడాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం గ్రహించాలి .
-చింత ఎల్లస్వామి రైతుల ఆత్మహత్యలపై పరిశోధన చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి