విశ్లేషణ: భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అణిచివేయరాదు

యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను పెట్టారంటూ, అలాంటి వాటిని ప్రచారం చేశారన్న నెపంతో రాష్ట్రంలో ఇటీవల పోలీసులు అనేక మందిని రాత్రికి రాత్రే అక్రమంగా నిర్బంధించారు. ఇలా అక్రమంగా నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేయడంపై పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తుతున్నది. ఇలాంటి ఈ చర్యలు ఎంత వరకు సమర్థనీయం అన్న చర్చ సర్వత్రా మొదలైంది. అసలు ప్రస్తుతం ఈ విషయంలో జరుగుతున్నదేంటి? గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు ఏం చెబుతున్నాయి? అనే అంశాలను పరిశీలిద్దాం. 
సోషల్ మీడియా, న్యూస్​ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో వ్యక్తులను, దేశంలో, రాష్ట్రంలో పదవుల్లో ఉన్న నాయకులను, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, అవమానపరుస్తూ పోస్టులు పెట్టడం, అలాగే వాటిని ప్రచారం చేయడం, ప్రచురించడం మొదలైనవి ముమ్మాటికీ చట్టవిరుద్ధం. ఇండియన్​ పీనల్​ కోడ్(ఐపీసీ) కింద ఇలాంటివి శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి చర్యలు ఏమాత్రం సమర్థనీయం కాదు. అయితే సోషల్​ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న నెపంతో విచక్షణారహితంగా, అక్రమంగా వ్యక్తులను నిర్బంధించడం, పోలీసులు రాత్రికి రాత్రే మఫ్టీలో వచ్చి తీసుకెళ్లడం డీకే బసు కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తీర్పునకు పూర్తిగా విరుద్ధం. ఇందుకు బాధ్యులైన పోలీసులు కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లే అని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అణిచివేయరాదు
భావవ్యక్తీకరణ స్వేచ్ఛ(ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్​ప్రెషన్) రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కు. పత్రికా స్వేచ్ఛ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రసారాలకు కూడా ఈ స్వేచ్ఛే రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద సహేతుకమైన పరిమితులను విధించే అధికారం ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగాలకు ఉన్నది. అయితే ఈ పరిమితుల పేరుతో ఏకంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఉక్కుపాదంతో అణచివేసే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ ఆర్.సుభాష్​రెడ్డి, జస్టిస్ బి.ఆర్ గవాయితో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. అనురాధా బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పును వెలువరించింది.

ఐపీసీ సెక్షన్ 499 కింద కేసు పెట్టొచ్చు
అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు, చేతలతో వ్యక్తులను, వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా ప్రసారాలు చేసినా, వ్యాఖ్యలు చేసినా సంబంధిత వ్యక్తిపై, వ్యక్తులపై ఇండియన్​ పీనల్​ కోడ్(ఐపీసీ)లోని సెక్షన్ 499 కింద కేసు పెట్టవచ్చు. అలాగే దేశ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను భంగపరిచే విధంగానూ, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రచారాలు చేసినా, వ్యాఖ్యలను పోస్ట్ చేసినా క్రిమినల్ ప్రొసీజర్​ కోడ్(సీఆర్పీసీ)​ కింద క్రిమినల్ కేసులు పెట్టవచ్చును. అయితే పరువునష్టం కేసులో కేవలం బాధిత వ్యక్తి మాత్రమే కేసు పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రముఖ సినీ నటి కుష్బూ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పును వెలువరించింది. మూడో వ్యక్తి తమ నేతకు పరువునష్టం జరిగిందంటూ క్రిమినల్ కేసు పెట్టడాన్ని చట్టం అనుమతించదు. అలాగే ఈ కేసుల్లో పోలీసులు నేరుగా క్రిమినల్ కేసును నమోదు చేయడానికి చట్టం అనుమతించింది. సుప్రీంకోర్టు డీకే బసు–ఆర్నిష్ కుమార్  కేసులో స్పష్టమైన తీర్పును ఇచ్చింది. అందుకు విరుద్ధంగా పోలీసు యంత్రాంగం నడుచుకుంటే వారు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని రాజ్యాంగ ధర్మాసనాలు గతంలో స్పష్టం చేశాయి.

ముందుగా నోటీసులు జారీ చేయాలి
తక్కువ శిక్షార్హమైన నేరాల విషయంలో పోలీసులు సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ కింద ముందుగా నిందితుడికి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరినైనా నిర్బంధించేందుకు వెళ్లిన పక్షంలో అలా వెళ్లిన పోలీసులు తమ పేరుగల గుర్తింపును ధరించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. అయితే పోలీసులు మఫ్టీలో వెళ్లి యూట్యూబర్లను, సోషల్​ మీడియా యూజర్లను అక్రమంగా నిర్బంధిస్తే ఇది రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పుల ఉల్లంఘనే అవుతుంది. ఇలా వ్యవహరించినందుకే ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఓ పోలీసు అధికారికి జరిమానా కూడా విధించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ హక్కులను రక్షించడం అనేది అందరి బాధ్యత. ముఖ్యంగా అధికార యంత్రాంగం నిర్వర్తించాల్సిన విధుల్లో ఇది కూడా ఒకటి. దానిని అధికార యంత్రాంగం తప్పకుండా పాటించాలి.