విశ్లేషణ: కన్నుల పండువగా కాశీ

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, ఎటువంటి నిర్మాణాన్ని తలపెట్టినా అది మన ఆధ్యాత్మిక సంపదను కాపాడేలా, భవిష్యత్‌‌‌‌ తరాలకు అందించేలా ఉంటుంది. జ్యోతిర్లింగం విశ్వనాథుడు, శక్తి పీఠం విశాలాక్షి, అన్నపూర్ణమ్మ, సకల పాపాలను ప్రక్షాళనం చేసే గంగానది, కాశీ నగర పురాధీశుడు కాలభైరవుడు, కాశీ నగరాన్ని కాపలా కాసే వారాహీ మాతలున్న ఈ క్షేత్రానికి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తూంటారు. కాశీ విశ్వనాథుడి స్పర్శ దర్శనంతో పులకించిపోతారు. విశిష్ఠ కాశీ విశ్వనాథ మందిరానికి పునర్​ వైభవం తీసుకురావడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.

భారత ఆధ్యాత్మిక కేంద్రాలలో కాశీ నగరానిది విశిష్ఠ స్థానం. ప్రతి భారతీయుడు మోక్ష ప్రాప్తికోసం మహా శ్మశానం కాశీ నగరంలో విశ్వనాథుడి సమక్షంలో తనువు చాలించాలని కోరుకుంటాడు. దేశదేశాల నుంచి కాశీ విశ్వనాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు కాశీ నగరం చేరుకున్న తరువాత కలిగే వెతలు గతంలో అనేకం. ఇరుకైన సందులు, అపరిశుభ్రంగా ఉండే దారులు, కాళ్ల కింద నుండి ప్రవహించే మల మూత్రాలు, నిర్ధాక్షిణ్యంగా విచక్షణా రహితంగా ప్రజలు వదలిపెట్టే వ్యర్థ పదార్థాలతో కలుషితం అవుతున్న గంగానదిలో స్నానం చేయాలంటే ఒకప్పుడు భక్త జనం ఎంతో ఆందోళనకు గురి అయ్యేవారు. భక్తులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరైన వ్యవస్థ ఉండేది కాదు. స్నానం చేసిన స్త్రీలు దుస్తులు మార్చుకునేందుకు అనువైన ప్రదేశం ఉండేది కాదు. గంగానది స్నాన ఘట్టాలు మురికి కూపాలుగా మారిపోయాయి. ఇటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొని కూడా భక్తులు అత్యంత శ్రద్ధా భక్తులతో కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వచ్చేవారు.

ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణంలో భాగాలు..
దాదాపు 800 కోట్ల రూపాయల అంచనాతో ‘భవ్యకాశీ–దివ్యకాశీ’ మందిర ప్రాంగణ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. 8 మార్చి 2019 నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మందిర ప్రాంగణ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. గతంలో సబర్మతీ నది ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర వహించిన, ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్న నూతన ప్లార్లమెంట్‌‌‌‌ భవన నిర్మాణం సెంట్రల్‌‌‌‌ విస్టాకు రూపకల్పన చేసిన బిమల్‌‌‌‌ పటేల్‌‌‌‌కు చీఫ్​ ఆర్కిటెక్ట్‌‌‌‌గా ఈ పని అప్పజెప్పారు. నూతన మందిర ప్రాంగణ నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు 300 ఆస్థులను కొనుగోలు చేసింది. ఈ విశాల ప్రాంగణం నిర్మాణం కోసం 1400 దుకాణదారులకు ప్రత్యామ్నాయ స్థలాలు అప్పగించి వారి వ్యాపార లావాదేవీలకు ఎటువంటి నష్టం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. మందిర ప్రాంగణ నిర్మాణంలో మొత్తం వ్యయంలో సగభాగం స్థలం యజమానులకు నష్టపరిహారంగా ఇచ్చారు. కొన్ని సందర్భాలలో స్థలం యజమానులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అందరికీ న్యాయ సమ్మతంగా పరిహారం చెల్లించి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులూ, కష్టనష్టాలు లేకుండా స్థలాలను సేకరించారు. ఏడు రకాల ప్రత్యేకమైన రాళ్లను మందిర ప్రాంగణ నిర్మాణంలో వినియోగించారు. ఇందులో రాజస్థాన్‌‌‌‌లోని మక్‌‌‌‌రానా, చునార్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలకు చెందిన రెడ్​స్టోన్‌‌‌‌ ఒకటి. మందిర ప్రాంగణంలో విశ్రాంతి గృహాలు, పురావస్తు శాలలు, గ్రంథాలయాలు, రక్షణ అవసరాల దృష్ట్యా భవన నిర్మాణాలను చేస్తున్నారు. మందిర ప్రాంగణంలో పారిజాతం, రుద్రాక్ష, అశోక, మారేడు దళాల చెట్లు పెంపకం కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. దీంతో పాటు మందిర ప్రాకారం చుట్టూ చెట్లు నాటి ఎల్లప్పుడూ పచ్చగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ‘భవ్యకాశీ–దివ్యకాశీ’ పథకం కోసం స్థలాల సేకరణకు ముందుగా డ్రోన్లతో పూర్తిస్థాయి సర్వే చేసినప్పుడు చుట్టుపక్కల అనేక చిన్న చిన్న మందిరాలు కనపడ్డాయి. ఈ మందిరాలను పునరుద్ధరించడంతోపాటు నిర్మాణ సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మందిరానికి నాలుగు దిక్కులా నాలుగు ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేశారు. మందిర గోడలను ఎర్ర రాతితో నిర్మించగా నేల మీద పాలరాతిని పరిచారు. ఈ నూతన ప్రాంగణానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే – గంగా వ్యూ గ్యాలరీ. ఇక్కడ కూర్చొని భక్తులు గంగానది ప్రశాంత, విశాల స్వరూపాన్ని దర్శించుకోవచ్చు. మందిరంలో కూర్చొని గంగమ్మను చూస్తూ ధ్యానం చేసుకోవచ్చు.

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా..
కాశీ విశ్వనాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా చూడటమే నూతన మందిర ప్రాంగణ ప్రధాన లక్ష్యం. శ్రావణ కార్తీక మాసాలలో, శివరాత్రి లాంటి పర్వదినాలలో ప్రతీ సోమవారం లక్షల మంది భక్తులు కాశీ విశ్వనాథుడి దర్శనానికి చేరుకుంటారు. ఒక అంచనా ప్రకారం శ్రావణ, కార్తీక మాసాలలో రెండున్నర లక్షల మంది భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీతో మొత్తం కాశీ నగరం జన సంద్రంగా మారిపోతోంది. భక్తులు నానా ప్రయాసలకు లోనవుతూ దాదాపు 3–4 కిలోమీటర్లు దూరం నడిచి మందిరానికి చేరుకుంటారు. దీని కారణంగా శివుడి మీద చిత్తం నిలపడంలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు భక్తులకు కలుగకుండా ఉండేందుకు ‘భవ్యకాశీ–దివ్యకాశీ’ పథకాన్ని చేపట్టారు. కొత్తగా చేపట్టిన నిర్మాణాల కారణంగా భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం చేసి, గంగాజలాన్ని తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేసి ప్రశాంతంగా బయటికి వెళ్లిపోవచ్చు. ఏ క్షణమైనా పదివేలమంది భక్తులు మందిర ప్రాంగణంలో ఉండవచ్చు.

స్వచ్ఛందంగా ముందుకొచ్చారు..
‘భవ్యకాశీ–దివ్యకాశీ’ పథకానికి మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నిర్మాణం పనులు పురోగతిలో కొనసాగుతుండటంతో స్థలం యాజమానులు తమ తమ స్థలాలను అప్పగించేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు. ఈ పథకం కోసం 314 ఇళ్లను కొన్నారు. పారదర్శకంగా ఆకర్షణీయమైన పారితోషికాలను స్థలం యజమానులకు అందించారు. చిన్న చిన్న స్థలాలకు కూడా సమాన స్థాయిలో పారితోషికం ఇచ్చారు. కొన్ని సందర్భాలలో ఇతరుల స్థలాలను ఆక్రమించిన వారికి కూడా నష్ట పరిహారం ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేయించారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలో కొన్ని ప్రాచీన మందిరాలు బయటపడ్డాయి. వీటి జీర్ణోద్ధరణకు తగిన చర్యలు చేపట్టారు. కొత్తగా నిర్మించిన మందిర ప్రాంగణంలోని అన్ని ప్రాచీన మందిరాలను పునరుద్ధరించారు. ఇందులో అనేక దేవాలయాలను భక్తుల దర్శనం కోసం ఇప్పటికే తెరిచారు.

రుద్రాక్ష కన్వెన్షన్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌
కాశీ నగరంలో సౌకర్యాల ఏర్పాటు కేవలం మందిర ప్రాంగణ నిర్మాణానికి మాత్రమే పరిమితం కాలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కాశీ నగరంలో 1200 మంది కూర్చునే వీలుగా అంతర్జాతీయ స్థాయిలో ‘రుద్రాక్ష’ కన్వెన్షన్‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. దీని ముఖ భాగాన శివలింగం ఆకారంలో108 రుద్రాక్షలు ఏర్పాటు చేశారు.  ఇది ఇప్పుడు కాశీ నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం. కాశీ నగరం చుట్టూ జాతీయ రహదారులను నిర్మించారు. పంచ్‌‌‌‌కాశీ పరిక్రమ (ప్రదక్షిణ) మార్గాన్ని పునరుద్ధరించారు. నగరంలో ప్రధాన కూడళ్లలో పార్కింగ్‌‌‌‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంగా ప్రక్షాళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి అందులో భాగంగా మురుగు నీటి పారుదల వ్యవస్థను బాగు చేశారు.

దివ్యకాశీ- భవ్యకాశీ పథకం..
స్వతంత్ర భారతదేశంలో చెప్పుకోదగ్గ కీలక ఘట్టాలలో 13 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 2021న ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా ప్రారంభమయిన ‘భవ్యకాశీ – దివ్యకాశీ’ ప్రాంగణం ఒకటి. 5 ప్రధాన లక్ష్యాలను ముందుంచుకునిఈ ప్రాంగణ నిర్మాణం ప్రారంభమయింది. గతంలో కాశీ విశ్వనాథుడి దర్శనానికి వచ్చే భక్తులు పవిత్ర గంగలో స్నానం చేసిన తరువాత ఇరుకు సందుల గుండా, మురికి మార్గాల ద్వారా నానా కష్టాలు పడుతూ రావాల్సి వచ్చేది. నిష్ఠగా స్నానం చేసి భక్తితో కాశీ విశ్వనాథుడిని దర్శించుకుందామనే భక్తులకు దారిలో ఎదురయ్యే అపరిశుభ్ర పరిస్థితులు, కాళ్ల కింద మురికి నీరు, దుర్గంథం, వ్యర్థ పదార్థాలు మనసును చికాకు పరుస్తూ ఏకాగ్రతను భగ్నం చేసేవి. ప్రస్తుతం నిర్మాణం అయిన ఈ పథకం కారణంగా భక్తులు గంగానదిలో స్నానం చేసి ఎటువంటి అవాంతరాలు లేకుండా.. అపరిశుభ్ర వాతావరణ లేకుండా.. నేరుగా కాశీ విశ్వనాధుడి దర్శనం చేసుకోవచ్చు. గంగానది ఒడ్డున అన్ని స్నాన ఘట్టాల నుండి నేరుగా మందిరంలోకి చేరుకునేలా నదికీ విశ్వనాథుడి మందిరానికి అనుసంధానం చేస్తూ రహదారి నిర్మిస్తారు. భక్తులు ఎటువంటి తోపులాటలకు లోను కాకుండా ప్రశాంతంగా మందిర ప్రాంగణానికి చేరుకునేలా విశాలమైన రోడ్లను నిర్మిస్తారు. ఒకప్పుడు మూడువేల చదరపు అడుగులు మాత్రమే ఉన్న మందిర ప్రాంగణం విప్లవాత్మకమైన మార్పులతో  5 లక్షల 20 వేల అడుగుల వైశాల్యానికి పెరిగింది. గతంలో దగ్గరగా చూసినప్పటికీ మందిర ప్రాంగణం, ప్రధాన గోపురం కనపడేవి కావు. ఇప్పుడు గంగానది ఒడ్డున స్నాన ఘట్టాలలో నిలబడి కూడా మందిర ప్రాంగణాన్ని చూడవచ్చు. ఈ ప్రణాళికలో భాగంగా దాదాపు 40 మందిరాలను పునరుద్ధరించి పూర్వ వైభవానికి తీసుకువచ్చారు. ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం కొత్త భవనాలను నిర్మించారు. భక్తులను అలౌకిక ఆధ్యాత్మిక భావనలలోకి తీసుకువెళ్లేలా విశాలమైన మందిర ప్రాంగణం నిర్మించాలన్నది ఈ ప్రణాళికలోని మరొక లక్ష్యం. 13 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 2021న ప్రధాని ప్రారంభించింది ఈ ప్రణాళికలోని మొదటి దశ మాత్రమే. దీనికోసం 338 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.

- కామర్సు బాల సుబ్రహ్మణ్యం, బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి