విశ్లేషణ: 136 ఏండ్ల కాంగ్రెస్ మళ్లీ గాడిన పడుతదా?

గ్రాండ్​ ఓల్డ్​ పార్టీ కాంగ్రెస్.. ఇవాళ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇలాంటి చారిత్రక ఘట్టం సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కాంగ్రెస్​ సంక్షోభాలను ఎదుర్కొంటోంది. మిగతా పార్టీల నుంచే కాదు.. సొంత ఇంటర్నల్​గా కూడా ఎన్నో సవాళ్లను ఫేస్​ చేస్తోంది. 2014 తర్వాత వరుస ఓటములు కాంగ్రెస్​ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. అదే సమయంలో సరైన నాయకత్వాన్ని అందించలేకపోవడం, క్యాడర్​లో నమ్మకాన్ని కలిగించలేకపోవడం ఆ పార్టీని జనాలకు దూరం చేశాయి. ఈ నేపథ్యంలో పూర్వవైభవం సాధించాలని సర్వశక్తులు ఒడ్డుతున్న ఆ పార్టీ ఆశలు నెరవేరుతాయా? కాంగ్రెస్​ను మళ్లీ దేశం యాక్సెప్ట్​ చేస్తుందా? జనాలు మళ్లీ ఆ పార్టీకి ఓట్లు వేస్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
2019  లోక్​సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్​ పార్టీకి ఒకదాని వెనుక ఒకటిగా సంక్షోభాలు ఎదురవుతూ వచ్చాయి. మొదట రాహుల్​గాంధీ పార్టీ ప్రెసిడెంట్​ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజస్తాన్, ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ లో ఆ పార్టీ అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొంది. ఇక గత ఏడాది 23 మంది సీనియర్​ నేతలు రాసిన లేఖ కాంగ్రెస్​లో ప్రకంపనలు సృష్టించింది. పార్టీలో ఇంటర్నల్​ వార్​కు తెరలేపింది. ఇలాంటి పరిస్థితుల్లో మనుగడను కాపాడుకోవడానికి అటు కాంగ్రెస్​ పార్టీ, ఇటు గాంధీ ఫ్యామిలీ ప్రతి రోజు సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే పార్టీని గట్టెక్కించేందుకు గాంధీ కుటుంబం చేయని ప్రయత్నాలు లేవు. కానీ అవేవీ అంతగా సక్సెస్​ కావడం లేదు. ఈ నేపథ్యంలో 136వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న కాంగ్రెస్​ పార్టీ కొత్త దారిలో నడిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది.

గాంధీ అడుగు జాడల్లో..
కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్​ 28న ఆవిర్భవించింది. దేశ చరిత్రలో ఆదో కీలక రోజుగా మిగిలిపోతుంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశంలో జరిగిన తొలి జాతీయోద్యమానికి ఊపిరిలూదింది కాంగ్రెస్​ పార్టీనే. దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపడంలో, వారిలో ఐక్యత తీసుకురావడంలో కాంగ్రెస్​ పార్టీ కృషి మరువలేనిది. ప్రజలతో కలిసి కాంగ్రెస్​ పార్టీ ఎన్నో విజయవంతమైన పోరాటాలు చేసింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్​ పార్టీ జాతీయ స్థాయికి విస్తరించింది. దేశ నలుమూలలకూ విస్తరించి.. ప్రతి ఒక్కరికీ చేరువైంది. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు ప్రజలకు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్సే. 1919లో గాంధీ రాకతో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఖిలాఫత్​ మూవ్​మెంట్​ సందర్భంగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీ తీసుకున్న చర్యలు ఆ పార్టీకి ప్రజలకు మరింత చేరువ చేశాయి. 1915  జనవరి 9న సౌతాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన గాంధీ.. 1917లో చంపారన్​ రైతు ఉద్యమంతో దేశం దృష్టిని ఆకర్షించారు. అయితే 1919లో ఖిలాఫత్ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు అందించడంతోనే జాతీయ రాజకీయ రంగంపై ఆయన ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ఒక్క చర్య కాంగ్రెస్‌ను ప్రార్థనలు, వినతుల పార్టీ నుంచి ప్రజల నమ్మకం పొందిన ఆర్గనైజేషన్​గా తీర్చిదిద్దింది. అప్పటి నుంచే బ్రిటిష్ సామ్రాజ్యానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఖిలాఫత్​ ఉద్యమం బ్రిటిష్​ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కాంగ్రెస్​ పార్టీకి పొలిటికల్​ గ్రౌండ్​ను క్రియేట్​ చేసింది. దీనిని అడ్డుకునేందుకు బ్రిటిష్​ పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. హిందూ, ముస్లిం మతతత్వశక్తులను ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. వాటన్నింటినీ తట్టుకుని కాంగ్రెస్​ పార్టీ తన స్థానాన్ని దేశ రాజకీయాల్లో సుస్థిరం చేసుకుంది. 

మోడ్రన్​ ఇండియా నిర్మాణంలో..
పార్టీ ఆవిర్భావం నుంచి స్వాతంత్ర్య పోరాటంలో ముందు నిలిచిన కాంగ్రెస్..​ఆ తర్వాత దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేసింది. దేశ మొదటి ప్రధానమంత్రి పండిట్​ జవహర్​లాల్​ నెహ్రూ ఆధునిక భారతదేశానికి రూపశిల్పిగా మారారు. పురాతన నాగరికత కలిగిన దేశాన్ని ఆధునికత వైపు నడిపించడానికి నెహ్రూ పునాది వేశారు. రాజకీయ సంస్థలు, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్, శాంతి కోసం న్యూక్లియర్ ఎనర్జీ వినియోగం, హెల్త్ కేర్, ఆర్ట్స్, లిటరేచర్ అండ్ కల్చర్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అంశాల్లో ఇండియాను ముందుకు నడిపించారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కొత్త ఉద్యోగాలు, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, యువతకు విద్యా అవకాశాల సృష్టికి కృషి చేశాయి. 

క్లిష్ట పరిస్థితుల్లో పగ్గాలందుకున్న సోనియా
1998లో కాంగ్రెస్​ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో సోనియాగాంధీ ప్రెసిడెంట్​గా బాధ్యతలు స్వీకరించారు. 2004లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్​ అడుగు జాడల్లో నడుస్తూ పదేండ్ల పాటు పార్టీని అధికారంలో నిలబెట్టారు. కాంగ్రెస్​ పార్టీకి సుదీర్ఘకాలం పాటు ప్రెసిడెంట్​గా సోనియా రికార్డు సృష్టించారు. విదేశీ మూలాలు కలిగిన మహిళగా కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ అయినవారిలో సోనియా మూడోవారు. ఆమెకంటే ముందు అనిబిసెంట్, నెల్లి సేన్​గుప్తా కాంగ్రెస్​ ప్రెసిడెంట్స్​గా పనిచేశారు. ఇక మహిళా కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ల విషయానికి వస్తే అనిబిసెంట్, నెల్లిసేన్​గుప్తా, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ తర్వాత సోనియా ఐదో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో సోనియాగాంధీ కాంగ్రెస్​ పార్టీకి ప్రెసిడెంట్​గా ఉన్నారు. ఇటీవల పార్టీ మీటింగ్​లో సోనియా మాట్లాడుతూ.. ‘‘త్రివర్ణ పతాకం గౌరవాన్ని కాపాడటానికి మనం ఏకం కావాలి. మువ్వన్నెల జెండా కింద మనం మన దేశానికి స్వాతంత్ర్యం సాధించాం. మళ్లీ మనం ప్రజల హృదయాలను గెలుచుకోవాలి. మనం కాంగ్రెస్ పునాదిపై ప్రతిజ్ఞ చేయాలి. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల కోసం మనం తుది శ్వాస వరకు పోరాడాలి”అని చెప్పారు.

సోనియాకు అగ్నిపరీక్ష
ఇప్పుడు మరోసారి సోనియాగాంధీపై కాంగ్రెస్​ పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత పడింది. 2017లో సోనియాగాంధీ పార్టీ పగ్గాలను వదిలేసి.. తన కుమారుడు రాహుల్​గాంధీకి బాధ్యతలు అప్పగించారు. అయితే 2019 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్​గాంధీ ప్రెసిడెంట్​ పదవికి రాజీనామా చేయడంతో.. మరోసారి ఆ బాధ్యతలను సోనియా చేపట్టాల్సి వచ్చింది. ఆమె ప్రెసిడెంట్​ పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఎన్నో సవాళ్లను కాంగ్రెస్​ పార్టీ ఎదుర్కోవాల్సి వచ్చింది. బయటి నుంచి కంటే అంతర్గత సమస్యలే పార్టీకి ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారాయి. గాంధీల నాయకత్వంపై సీనియర్లు నమ్మకం కోల్పోయారు. వరుస ఓటములు పార్టీని కుంగదీశాయి. మరోవైపు కీలక నాయకులంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీ లాంటి వారు కాంగ్రెస్​ను మరింత దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్​ పార్టీపై ఇప్పటికీ అభిమానం ఉంది. కానీ దానిని ఓట్లుగా మార్చుకునే సత్తా, నాయకత్వం ఆ పార్టీ అందించలేకపోతోంది. దేశవ్యాప్తంగా పార్టీకి కేడర్, 20 శాతం ఓటు బ్యాంకు ఉంది. వచ్చే ఏడాది చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిల్లో కొన్నింటిని గెలిచినా.. కాంగ్రెస్​కు కొత్త ఉత్తేజం వస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలు గెలిచినంత మాత్రాన సరిపోదు.. పార్టీలో అంతర్గతంగానూ మార్పులు రావాలి. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. పార్టీకి దూరంగా ఉన్నవారందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. అప్పుడే 2024 లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్​ పార్టీ సిద్ధం కాగలుగుతుంది. అన్ని వైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది.
- పర్సా వెంకట్, పొలిటికల్​ ఎనలిస్ట్