‘విదేశీ కంపెనీకి పురపాలకశాఖ నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్‌కు చెప్పాను. అంతా తాను చూసుకుంటానని కేటీఆర్ అన్నారు. ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే కాపాడలేకపోవడం వాస్తవమే' అని ఫార్ములా ఈ కారురేసు కేసులో ఏ2గా ఉన్న నాటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ బుధవారం ఏసీబీకి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కేబినెట్ ఆమోదం లేకపోవడం, ఆర్థికశాఖ అనుమతి తీసుకోకపోవడం, సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన,విదేశీ కరెన్సీ చెల్లింపులు, ఆర్‌బీఐ అనుమతికి సంబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లతోపాటు, కేటీఆర్‌తో జరిపిన వాట్సాప్ చాట్ మెసేజ్‌లను కూడా అధికారులకు ఆయన అందజేశారని తెలుస్తోంది.
సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఎక్కువగా డాక్యుమెంట్లు, ఇతర ఆధారాల అనుగుణంగానే విచారణ జరుగుతుందని ఏసీబీ మాజీ
డైరెక్టర్ జనరల్ పూర్ణచంద్రరావు మీడియాకు చెప్పారు. ఆయన కథనం ప్రకారం అరవింద్ కుమార్ కొన్ని డాక్యుమెంట్లు, వాట్సాప్ చాటింగ్‌ను ఏసీబీకి అందజేసినందున కేటీఆర్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లే కనబడుతోంది.
కాగా, ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసులో ఉమ్మడి ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాదాపు ఏడాదిపాటు జైలులో ఉన్నారు. 2004-–2009 మధ్య ఆమె మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి మైనింగ్ లీజ్ విషయంలో శ్రీలక్ష్మిపై సీబీఐ అప్పట్లో కేసు నమోదు చేసింది. 1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ముందు
జాగ్రత్తగా నాటి మంత్రి కేటీఆర్‌తో వాట్సాప్ సంభాషణలు భద్రం చేసుకొని పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినతర్వాత విదేశీ కంపెనీలకు డబ్బు చెల్లింపులు జరపకూడదని తాను మొత్తుకున్నా కేటీఆర్ వినలేదన్నది అరవింద్ కుమార్ వివరణ.
చట్టాలకు అతీతులమనే భ్రమలో
ఇదిలా ఉండగా ఫార్ములా- ఈ– కార్ రేసింగ్ స్కాంలో ప్రాథమిక ఆధారాలున్నట్టు హైకోర్టు స్పష్టం చేయడం బీఆర్ఎస్ను వణికిస్తోంది. గత వారం రోజులుగా కేటీఆర్ విన్యాసాలు తెలంగాణ ప్రజలకు వినోదం కలిగిస్తున్నాయి. ఏసీబీ ప్రధాన కార్యాలయం చేరుకొని, తనతోపాటు తన అడ్వకేట్లను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని మొండికేసి వెనక్కి వెళ్లిపోవడం ఆయన దురుసుతనాన్ని తెల్పుతున్నది. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావును అనుమతిస్తూనే విచారణ ప్రక్రియను దూరం నుంచి వీక్షించాలని హైకోర్టు ఆదేశించింది. దీనివల్ల కేటీఆర్‌కు జరిగిన ప్రయోజనమేమిటి? ఆయనకే తెలియాలి. చట్టాలకు అతీతులమనే అహంభావం ఆయన ప్రవర్తనలో కనిపిస్తున్నది.
కేటీఆర్ నోటి దురుసు అభద్రతాభావానికి నిదర్శనం
ఫార్ములా -ఈ కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ, ఈడీ కేసులు నమోదుచేసిన నాటి నుంచి కేటీఆర్ మీడియాలో దురుసుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఈ కేసు ఉత్త కేసు. లొట్టపీసు కేసు. ఆయనో లొట్టపీసు ముఖ్యమంత్రి. అర పైసా కూడా నేను అవినీతికి
పాల్పడలేదు. నేను ఏ తప్పు చేయలేదు. తలవంచను. కేసులకు, జైళ్లకు భయపడేది లేదు’ అంటూ ఆయన శివాలెత్తి మాట్లాడుతున్నారు. కానీ, ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతుండటం చూస్తే.. కేటీఆర్ ప్రదర్శిస్తున్న ధైర్యం నిజమైనదేనా? లేక నటనా? అనే అనుమానాలు సామాన్యుడికి సైతం కలుగుతు
న్నాయి. తాను కడిగిన ముత్యమంటూ కేటీఆర్ తనకు తానే జనవరి 7వ తేదీ రాత్రి సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. నిజంగానే కడిగిన ముత్యంలా వచ్చేవాడైతే.. లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం అనే అనాగరిక సంబోధన ఎందుకు చేసినట్లు? కేసులో బలమైన సాక్ష్యాలు ఉన్న కారణంగానే.. ఆయన అనాగరిక భాషను ఎంచుకున్నాడని ఇప్పటికే సమాజంలో చర్చ జరుగుతోంది.
గవర్నర్ అనుమతితోనే కేసు నమోదు
ప్రొఫెసర్ కోదండరాం వంటి ఉద్యమ నాయకులపై ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేశారో, ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారో, తెలంగాణ సమాజానికి తెలుసు. కేటీఆర్‌లో అహంకారం పరాకాష్టకు చేరినట్టు ఆయన బాడీ లాంగ్వేజ్‌ను బట్టి విశ్లేషణ జరుగుతోంది. ఆయనపై నమోదైన కేసు సక్రమమా? అక్రమమా? కేటీఆర్ దోషియా, నిర్దోషియా అన్నది కోర్టు తేల్చనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు బయలుదేరుతూ మీడియా ముందుకువచ్చి, ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని విచక్షణా రహితంగా దూషించారు.
చట్ట ఉల్లంఘనల్లో ఇరుక్కున్న కేటీఆర్ ఈ కేసును రాజకీయ ప్రేరేపితంగా చూపే ప్రయత్నంలో భాగంగా అసభ్యకర వ్యాఖ్యలను, అసంబద్ధ సవాళ్లను ఆశ్రయిస్తున్నారని అర్థమవుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా నిధుల బదిలీ
ఫార్ములా - ఈ కార్ రేసు'లో హెచ్‌ఎమ్‌డీఏ భాగస్వామి కాకపోయినా, దాని ఖాతా నుంచి రూ.54.88 కోట్లు చెల్లించారు. ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే కేటీఆర్ ఇందుకు ఒత్తిడి తెచ్చారన్నది ఒక అభియోగం. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నిబంధనలను తుంగలో తొక్కి విదేశీ కంపెనీలకు ఫండ్స్ మంజూరు చేయడం మరో అభియోగం. నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నిధులు బదిలీ చేయడంతో హెచ్‌ఎండీఏ ఆదాయపన్ను శాఖకు రూ.8 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఫార్ములా -ఈ కార్ రేసుకు సంబంధించి మూడేళ్లలో 600 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పం
దాలు జరిగినట్టు కూడా అభియోగాలున్నాయి.
అరెస్ట్ జరిగితే
బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువుల పార్టీ అన్నది జగద్విదితం. కనుక కేటీఆర్‌పై కేసు నమోదు కాగానే రాష్ట్రంలో భూకంపం వచ్చిన స్థాయిలో ఆ పార్టీ నాయకులు స్పందించాలనే ప్రణాళికలతో ఉన్నట్లు భోగట్టా. కేటీఆర్ జైలుకు వెళితే బీఆర్ఎస్ పార్టీని ఎవరు నడిపించాలనే దానిపై కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
'క్విడ్ ప్రో కో' ఆరోపణలు
గ్రీన్ కో సంస్థ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.41 కోట్ల విరాళం బీఆర్ఎస్కు ఇవ్వడం 'క్విడ్ ప్రో కో' కిందకు వస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇదొక ట్విస్ట్. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసును తవ్వుతుంటే 'క్విడ్ ప్రో కో' ఆరోపణలు వెల్లువెత్తుతుండటం చూస్తుంటే ఏసీబీ దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశాలనూ ఎవరూ కాదనలేకపోతున్నారు.
ఫ్రస్ట్రేషన్లో నోరు జారుతున్నడు!
ఈ కేసులో ప్రభుత్వం వద్ద ఇప్పటికే అనేక బలమైన సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు ఊరికే ముగిసేది కాదు. దర్యాప్తు జరుగుతూ పోతుంటే, మరిన్ని కొత్త విషయాలు బయటకు వచ్చేటట్లున్నాయి. ఇలాంటి స్థితి కనిపిస్తున్న సందర్భంలో కేటీఆర్ చాలా అసహనానికి గురవుతున్నారని కనిపిస్తున్నది. అందుకు ఉదాహరణ చెప్పాలంటే.. దీన్ని లొట్టపీసు కేసు అని, లొట్టపీసు ముఖ్యమంత్రి వంటి అనాగరిక వ్యాఖ్యలు..ఆయనలో దాగి ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను స్పష్టంగా బయటపెడుతున్నాయి.
గ్రీన్ కో పట్ల అంత సానుభూతి ఎందుకో?
2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్ల కొనుగోలు కథ నడిచింది. గ్రీన్‌కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయింది. దీంతో మరుసటి ఏడాది రేస్ స్పాన్సర్షిప్ నుంచి గ్రీన్ కో తప్పుకుంది. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?’ అని కేటీఆర్ అంటున్నారు.
ఫార్ములా -ఈ రేసు కారణంగా రాష్ట్రానికి రూ.700 కోట్ల లాభం జరిగిందని.. గ్రీన్ కో సంస్థ మాత్రం నష్టపోయిందని.. ఆ సంస్థ తరఫున కేటీఆర్ వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతుండటం చూసి తెలంగాణ ప్రజలే ఆశ్చర్యపోతుండటం ఈ కార్ రేసు కేసులో అసలు సిసలైన కొసమెరుపు.
-ఎస్.కే. జకీర్,
సీనియర్ జర్నలిస్ట్