- 60 వేల లడ్డూలు సిద్ధం చేస్తున్న సిబ్బంది
- రాత్రి 10 వరకు ప్రసాద కౌంటర్లు ఓపెన్
యాదగిరిగుట్ట, వెలుగు: న్యూఇయర్ సందర్భంగా యాదాద్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో యాదగిరిగుట్ట టెంపుల్‌తో పాటు అనుబంధ ఆలయమైన పాతగుట్ట నారసింహుడి క్షేత్రంలోనూ పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని శనివారం ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు.
భక్తుల రద్దీకి సరిపడా లడ్డూలు, పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. దాదాపు 60 వేల100 గ్రాముల లడ్డూలు, అభిషేకం లడ్డూలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసాద కౌంటర్లు తెరిచి ఉంటాయని తెలిపారు. అన్నిచోట్ల తాగునీటి సౌకర్యంతో పాటు కొండపైకి భక్తుల రాకపోకలకు ఉచిత ఆర్టీసీ బస్సులను నడిపించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
యాదాద్రిలో వెయిటింగ్ హాళ్లు
శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. శనివారం యాదగిరిగుట్టకు వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని.. క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, బస్ బే, ప్రధానాలయ పరిసరాలను పరిశీలించారు.
తర్వాత ఈవో ఆఫీస్ మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారికి ఆరగింపు సందర్భంగా దర్శనాలు నిలిపివేసిన సమయంలో భక్తులు కూర్చోవడానికి వెయిటింగ్ హాళ్లు, దర్శనం అనంతరం సేద తీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ త్వరలోనే స్వామివారి దర్శనానికి రానున్నారని, ఆమె సూచనల మేరకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
న్యూఇయర్ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ ఉన్నారు.