బతుకమ్మ పండుగను తెలంగాణరాష్ట్రంలో తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలు జరుపుకుంటాం. ఈ పండుగలలో ఒకటి 'బతుకమ్మ పండుగ', మరొకటి దసరా (విజయ దశమి). అయితే, బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది.
పండుగ చారిత్రక నేపథ్యం
ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు, పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి 'బతుకవమ్మా' లేదా 'బతుకు అమ్మా'అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" పాటల వెనుక ఉండే మర్మం ఇదే.
ప్రకృతి పండుగ
బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. ప్రపంచమంతా పూలతో దేవుడినిపూజిస్తే ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతి తెలంగాణలో బతుకమ్మగా బతికున్నది. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం.
Also Read :- గాంధీ జయంతి స్పెషల్
తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ.. మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. 9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ, ఆశ్వయుజ అష్టమి నాడు అదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే పండుగ
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతిసాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. బతుకమ్మను పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెడతారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీ దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడతారు. ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుంచి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండిలను ఇచ్చి పుచ్చుకొని తింటారు.
పూల సంబరం పండుగ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబురం బతుకమ్మ పండుగ. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.
ప్రపంచంలోనే అద్భుతమైన పండుగ
తెలంగాణ ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడతారు. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయె చందమామ, కోసలాదేశుండు నుండి ఉయ్యాలో దశరథ రాముండు ఉయ్యాలో, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ అంటూ పాటలు మహిళల నోటి నుంచి జాలువారుతాయి. ఇంత చక్కని, అందరూ సమష్టిగా జరుపుకునే అందమైన, అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే అని చెప్పటం తెలంగాణాకే గర్వకారణం.
డాక్టర్ కోడూరి శ్రీవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, శాతవాహన యూనివర్సిటీ